Terror Attack | గత నెల 22న జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రదాడి ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. అడవిలో నుంచి వచ్చిన ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా నరమేధం సృష్టించారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్యాప్తులో కీలక పురోగతి సాధించింది. ఈ పాశవిక దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.
లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తెలిపింది. ఈ దాడికి పాకిస్థాన్‌లోని లష్కరే ప్రధాన కార్యాలయంలో ప్రణాళిక రచించినట్లు పేర్కొంది. సీనియర్ ఐఎస్ఐ అధికారుల సూచనలతో దాడి జరిపినట్లు తెలిపింది. దాడికి పాల్పడిన ముష్కరుల్లో హష్మి ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా భాయ్ పాకిస్థాన్ పౌరులుగా అధికారులు గుర్తించారు. వీరిద్దరూ పాక్కుచెందిన హ్యాండ్లర్లతో టచ్‌లో ఉంటూ నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. దాడి అమలుపై వారి సూచనలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దాడికి కొన్ని వారాల ముందు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు చెప్పారు. వారికి ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నెట్వర్క్ సాయంతో దాడికి పాల్పడినట్లు ఎన్ఐఏ వర్గాలు వివరించాయి.
దక్షిణ కశ్మీర్‌లోనే పహల్గాం ఉగ్రవాదులు
మరోవైపు ఈ దాడికి పాల్పడిన ముష్కరులు ఇంకా కశ్మీర్లోయలోనే తలదాచుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. ముష్కరులు దక్షిణ కశ్మీర్ (south Kashmir)లో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన బలమైన ఆధారాలు ఉన్నట్లు తాజాగా వెల్లడించాయి. ఒకవేళ భద్రతా బలగాలు వారిని గుర్తించి కాల్పులు జరిపితే.. కవర్ ఫైర్ చేసేలా మరింతమంది ముష్కరులను వీరికి బ్యాకప్‌గా ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉనికి బయటపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సదరు వర్గాలు గుర్తించాయి. ఆహార సామగ్రితోపాటు ఇతర ముఖ్యమైన వస్తువులను తమవెంట తీసుకెళ్లినట్లు గుర్తించామని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అటవీ ప్రాంతంలో ఎక్కువ కాలం గడిపినా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఉండేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లూ చేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దాడి సమయంలో ఉగ్రవాదులు సిమ్‌కార్డుతో పనిలేని అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించినట్టు తెలిసింది.
నాలుగుచోట్ల రెక్కీ నిర్వహించి..
గత నెల 22న పెహల్గామ్లోని మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం సమయంలో సమీపంలోని అడవిలో నుంచి వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ నరమేధంలో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటన అనంతరం కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట మొదలు పెట్టారు. ఈ క్రమంలో టెర్రరిస్టులకు క్షేత్ర స్థాయిలో సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ (Over Ground Workers)ను పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు. వారిని విచారించగా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ముష్కరులు (Terrorists) కొన్ని రోజుల ముందే పెహల్గామ్ వచ్చి నాలుగు చోట్ల రెక్కీ నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. పక్కా ప్రణాళికతోనే బైసరాన్ వ్యాలీ (Baisaran Valley)లో నరమేధం సృష్టించినట్లు అధికారులు తమ దర్యాప్తులో తేల్చారు. ఉగ్రవాదులు ఏప్రిల్ 15వ తేదీనే పెహల్గామ్కు వచ్చినట్లు అరెస్టైన వారిలో ఒకరు చెప్పినట్లు దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఆ తర్వాత వారు నాలుగు చోట్ల రెక్కీలు నిర్వహించినట్లు చెప్పారు. బైసరాన్ వ్యాలీ, అరు వ్యాలీ, అమ్యూస్మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీలను సందర్శించి రెక్కీ నిర్వహించారు.
అయితే అరు వ్యాలీ, అమ్యూస్మెంట్ పార్క్, బేతాబ్ వ్యాలీలో భద్రతా ఏర్పాట్లు ఉండటంతో వారు దాడులు చేయడానికి వెనుకంజ వేశారు. బైసరాన్ వ్యాలీలో భద్రత లేకపోవడంతో తమ దాడికి సరైన ప్రదేశంగా ఎంచుకున్నారు. అక్కడ విచక్షణా రహితంగా కాల్పులు జరిపి 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ ఉగ్రవాదులకు క్షేత్రస్థాయిలో దాదాపు 20 మంది సహకరించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. వీరిలో చాలామందిని ఇప్పటికే అరెస్టు చేసింది. మిగిలిన వారు నిఘా నీడలో ఉన్నారు. కేసుకు సంబంధించి 20 మంది నిరాయుధ టెర్రరిస్టులను, 186 మంది అనుమానితులను ఎన్ఐఏ ప్రశ్నించింది.
Also Read..
Attari – Wagah border | వాఘా సరిహద్దును తిరిగి తెరిచిన పాకిస్థాన్
Cyber Attacks | పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌లో 10 లక్షల సైబర్ దాడులు
Air India | పాక్ ఆంక్షలు.. ఎయిర్ ఇండియాకు రూ.వేల కోట్ల నష్టం..!