Pak reaction : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో పాకిస్థాన్ (Pakistan) నుంచి ప్రత్యక్ష, పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తూ భారత్ (India) ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగింది. భారత జెండా ఉన్న నౌకలు తమ ఓడరేవులను ఉపయోగించుకోవడంపై నిషేధం విధించింది. భారత్ నుంచి దిగుమతి చేసుకునే పలు వస్తువులపైనా బ్యాన్ విధిస్తున్నట్లు తెలిపింది.
అంతేగాక పాకిస్థాన్ నౌకలు కూడా భారత్‌లోని రేవులకు వెళ్లడానికి వీల్లేదని ఉన్నతాధికారులు ఆంక్షల విధించారు. న్యూఢిల్లీతో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ సముద్ర వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా పాక్ నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు భారత వాణిజ్య మంత్రిత్వశాఖ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్థాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
పాకిస్థాన్‌తో సముద్ర రవాణా మార్గాలను భారత్ మూసివేసింది. ఆ దేశ జెండాతో ఉన్న ఓడలు భారత పోర్టుల్లోకి రాకుండా కేంద్రం నిషేధం విధించింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టం 1958లోని 411 సెక్షన్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆంక్షలు తక్షణమే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. అటు భారత ఓడలు కూడా పాక్ పోర్టుల్లోకి వెళ్లకూడదని స్పష్టం చేసింది. ఇప్పటికే పాక్ విమానాలకు మన గగనతలాన్ని కూడా మూసివేశారు.
మరో వైపు పాకిస్థాన్ నుంచి భారత్‌కు వివిధ మార్గాల్లో వచ్చే అన్నిరకాల ఉత్తరాలు, పార్సిళ్ల రవాణాను కూడా నిలిపివేస్తున్నట్లు తపాలా శాఖ ప్రకటించింది. 2019లో పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ దిగుమతులపై కేంద్రం 200% సుంకాన్ని విధించింది. దాంతో అవి చాలావరకు తగ్గిపోయాయి. పహల్గాం ఉగ్రదాడి, సరిహద్దుల్లో కవ్వింపు చర్యల నేపథ్యంలో ఇప్పుడు ఇతర దేశాల మీదుగా పాక్ నుంచి వచ్చే దిగుమతులను సైతం నిలిపివేసింది.
ఇది భారత్‌కు ఎగుమతులపైనే ఆధారపడుతున్న పాకిస్తాన్‌లోని కొన్ని పరిశ్రమలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది.