Pakistan : పాకిస్తాన్లో సైనికులకు సరిపడా మంచి నీళ్లు కూడా ఇవ్వలేకపోతోంది ప్రభుత్వం. కానీ, బయటకు మాత్రం ఏదో గొప్ప దేశంలాగా ప్రగల్భాలు పలుకుతుంది. అక్కడ సైనికులే మంచి నీళ్ల కోసం కొట్టుకునే పరిస్థితి తలెత్తిందంటే ఆ దేశం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. అక్కడ నీటి కొరత ఎలా వేధిస్తుందో అంచనా వేయవచ్చు.
తాజాగా పాకిస్తాన్లో రెండు గ్రూపులకు చెందిన సైనికులు మంచి నీటి కోసం పరస్పదం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 22 మంది సైనికులు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని అప్పర్ సైత్ వజిరిస్తాన్ ప్రాంతంలోని అస్మాన్ మాంజా బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగింది. అక్కడి నీటి పంపిణీ కేంద్రంలో సైనికుల మధ్య ఘర్షణ తలెత్తింది. స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్జీ) కమాండోలు, ఫ్రంటియెర్ కార్ప్స్ (ఎఫ్‌సీ) ట్రూప్స్కు, ప్లెయిన్ క్లోత్స్ మిలిటరీ ఇంటెలిజెన్స్ పర్సనల్ గ్రూప్‌కు మధ్య ఈ వివాదం నడిచింది. వీరు విధులు నిర్వర్తించే ఈ ప్రాంతంలో తీవ్ర నీటి కొరత ఉంది. దీంతో ట్యాంకర్ల ద్వారానే కొంతకాలంగా నీటి సరఫరా జరుగుతోంది.
విధుల్లో ఉన్న ఆయా గ్రూపులకు చెందిన సైనికులు ఈ ట్యాంకర్ల నీటినే వాడుకోవాలి. అయితే, తాజాగా ఒక ట్యాంకర్ వచ్చిన సందర్భంగా ఆ నీటిని తామంటే తామే వాడుకుంటామంటూ ఈ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఒక గ్రూపు సైనికులు, మరో విభాగపు సైనికులపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పరస్పరం దాడులు చేసుకోవడంతో దాదాపు 22 మంది సైనికులు గాయపడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డవారికి అక్కడి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ ఘటన ద్వారా పాక్ సైనికులు ఎంత క్రమ శిక్షణతో ఉంటారో తేలింది. అలాగే, పాక్ సైన్యంలోని డొల్లతనం, నిధుల లేమి వంటివి కూడా మరోసారి చర్చకు వస్తున్నాయి.