Uttarakhand : నూతన సంవత్సర వేడుకల ముందు ఉత్తరాఖండ్‌లోని అటవీ ప్రాంతంలో పాకిస్థాన్ జాతీయ జెండా, రెండు బ్యానర్లు కలకలం రేపాయి. ఆకుపచ్చ రంగు బెలూన్స్‌కు పాకిస్థాన్ జెండా, బ్యానర్లు కట్టి ఉండడం గమనించిన పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ విషయాన్ని వెంటనే కేంద్ర నిఘా సంస్థకు తెలియజేశారు. ‘ఉత్తరాఖండ్‌లోని తుల్యాడ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం పాకిస్థాన్ జెండా, బ్యానర్లు కనిపించాయి. వీటిలో ఒక బ్యానర్ ఉర్దూలో ఉంది. రెండో బ్యానర్ మీద ‘LBA’ (ఎల్బీఏ) అని ఇంగ్లీషులో పెద్ద అక్షరాల్లో రాసి ఉంది. దాని కింద క్యాబినెట్ లాహోర్ బార్ అసోసియేషన్ అని రాసి ఉంది’ అని ఉత్తర కాశీ ఎస్పీ అర్పణ్ యదువంశీ తెలిపారు. పాక్ జెండా, బ్యానర్లను ఎవరు బెలూన్లకు కట్టి వదిలారు? దీని వెనక ఏదైనా ఉగ్రవాద సంస్థ హస్తం ఉందా? అనే కోణంలో కేంద్ర నిఘ సంస్థ దర్యాప్తు చేస్తోంది.
తమ గ్రామానికి దగ్గర్లోని అడవిలో పాకిస్థాన్ జెండా, బ్యానర్లు కనిపించాయని తుల్యాడ గ్రామస్థులు ధారసు పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓగా ఉన్న కమల్ కుమార్ లుంథికి తెలియజేశారు. దాంతో, వెంటనే అప్రమత్తమైన ఆయన ఉన్నాధికారులకు రిపోర్టు చేశారు.