శ్రీనగర్: కుక్క తోక వంకరే.. అన్న చందంగా పాకిస్థాన్ (Pakistan) తన తీరును మార్చుకోవడం లేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడవడంపై భారత్ (India Pakistan) హెచ్చరికలు జారీచేసినా పట్టించుకోవడం లేదు. సరిహద్దుల్లో నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఏకపక్షంగా కాల్పులకు తెగబడుతూనే ఉన్నది. వరుసగా ఏడో రోజూ రాత్రి పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉన్న కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరిపారు. అయితే పాక్ రేంజర్ల కాల్పులను భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ మేరకు సైన్యం వెల్లడించింది. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌పై పాక్ అప్రకటిత కాల్పులు జరుపుతున్న విషయం తెలిసిందే.
కాగా, బుధవారం రాత్రి కూడా పాక్ సైన్యం కాల్పులు జరిపిందని, వీటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. జమ్ములోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి, రాజౌరీ జిల్లాలోని సుందరబానీ, నౌషార సెక్టార్లలో, కశ్మీర్‌లోని బారాముల్లా, కుప్వారాలో భారత్ సైనిక పోస్టులే లక్ష్యంగా పాక్ ఆర్మీ కాల్పులు జరిపిందని తెలిపింది. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరిస్తూ భారత్-పాక్ మధ్య ఫిబ్రవరి 2021లో అంగీకారం కుదిరింది. అయితే దీనిని పాక్ ఏకపక్షంగా ఉల్లంఘిస్తూ, వరుసగా ఆరో రోజు రాత్రి భారత్ సైన్యంపై కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. ఇరు దేశాలను విడదీస్తూ గుజరాత్ నుంచి జమ్ములోని అఖ్నూర్ వరకు 3,323 కిలోమీటర్ల వెంబడి భారత్ సరిహద్దును కలిగి ఉంది. ఇందులో అంతర్జాతీయ సరిహద్దు 2,400 కిలోమీటర్లుగా, 740 కిలోమీటర్లు ఎల్వోసీ (నియంత్రణ రేఖ)గా ఉంది. కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడవడంపై భారత్ హెచ్చరికలు జారీచేసింది. ఇరు దేశాలకు చెందిన మిలిటరీ ఆపరేషన్ డైరెక్టర్ జనరళ్లు హాట్‌లైన్ ద్వారా మాట్లాడుకున్నారని, పాక్ కాల్పులకు తెగబడుతుండటంపై భారత్ వార్నింగ్ ఇచ్చినట్టు రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
పాక్ విమానాలకు భారత గగనతలం మూసివేత
పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌ను భారత్ అష్ట దిగ్బంధం చేస్తున్నది. తాజాగా పాక్‌కు చెందిన విమానాలు భారత గగనతలంలోకి రాకుండా ఆంక్షలు విధించింది. ఇప్పటికే పాక్ తన గగనతలాన్ని మూసివేసి భారత్ విమానాలకు ప్రవేశం లేకుండా అడ్డుకుంది. దీనికి ప్రతీకారంగా భారత్ కూడా పాకిస్థాన్‌కు చెందిన, దాని ఆధ్వర్యంలో నడుస్తున్న, ఆ దేశం లీజుకు తీసుకున్న వాణిజ్య విమానాలతో పాటు మిలిటరీ విమానాలకు తమ గగనతలంలో ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 30 నుంచి మే 23 వరకు అమలులో ఉంటాయని తెలిపింది. భారత్ విధించిన ఈ ఆంక్షలతో కౌలాలంపూర్ లాంటి ఆగ్నేయ ప్రాంతాలకు వెళ్లే పాకిస్థాన్ విమానాలు చైనా, శ్రీలంక లాంటి దేశాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.