న్యూఢిల్లీ: భారతీయ సైనిక వెబ్సైట్లను(Indian Military Websites).. పాకిస్థాన్ సైబర్ గ్రూపులు టార్గెట్ చేస్తున్నాయి. దీంతో కొన్ని మిలిటరీ వెబ్సైట్లు డౌన్ అయ్యాయి. కొన్ని వెబ్సైట్లు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి. భారతీయ రక్షణ దళ అధికారులకు చెందిన సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆఫీసర్లకు చెందిన లాగిన్ క్రెడెన్షియల్స్, పర్సనల్ డిటేల్స్‌ను పాకిస్థాన్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. భారతీయ సైనిక దళాలతో పాటు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలసిస్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేసినట్లు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ తన ఎక్స్ అకౌంట్లో పేర్కొన్నది.
రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్మర్డ్ వెహికిల్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన వెబ్‌సైట్‌ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. హ్యాక్ అయిన ఆ కంపెనీ వెబ్‌పేజీని ఎక్స్ అకౌంట్లో చేసింది ఆ సైబర్ గ్రూపు. ఆర్మర్డ్ వెహికిల్ నిఘమ్ లిమిటెడ్ స్థానంలో పాకిస్తాన్ జెండా, ట్యాంక్ కనిపిస్తున్నాయి. ఆర్మీ ఆఫీసర్లకు చెందిన కొన్ని పేర్లను ప్రచురించారు. అకౌంట్లు హ్యాక్ అయినట్లు కొందరు ఆఫీసర్లకు మెసేజ్‌లు వస్తున్నాయి.
మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్కు చెందిన 1600 మంది యూజర్ల 10జీబీ డేటాను హ్యాక్ చేసినట్లు సైబర్ నేరగాళ్లు ప్రకటించారు. అయితే ముందస్తు జాగ్రత్తగా ఆర్మర్డ్ వెహికిల్ నిఘమ్ లిమిటెడ్ వెబ్‌సైట్‌ను ఆఫ్‌లైన్‌లో పెట్టినట్లు అధికారులు చెప్పారు. పాకిస్థాన్ చేస్తున్న సైబర్ దాడుల్ని తిప్పికొట్టేందుకు భారతీయ సైబర్ సెక్యూర్టీ నిపుణులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. సైబర్ గ్రూపు HOAX1337, నేషనల్ సైబర్ క్రూ అనే హ్యాకింగ్ గ్రూపులు జమ్మూలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్ల వెబ్సైట్లను హ్యాక్ చేశాయి. పెహల్గామ్ బాధితుల ఫోటోలు మార్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ హ్యాకింగ్ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది.