ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ పర్యటనపై దాయాది పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చీనాబ్ నదిపై రాట్లే, క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన శంకుస్థాపన చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా చేయడం సింధు జల ఒప్పందాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించినట్లే అవుతుందని పాక్ మండిపడింది.
ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు రూ.5300 కోట్లతో చినాబ్ నదిపై తలపెట్టిన 850 మెగావాట్ల రాట్లే జలవిద్యుత్ కేంద్రానికి, రూ.4500 కోట్లతో చేపట్టిన 540 మెగావాట్ల క్వార్ జలవిద్యుత్ కేంద్రానికి మోదీ శంకుస్థాపన చేశారు. దీనిపైనే పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
లోయలో సాధారణ పరిస్థితులు నెలకొనలేదని, అలా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న బూటకపు మాటలను మోదీ మాట్లాడుతున్నారని పాక్ ధ్వజమెత్తింది. ఇదో ఎత్తుగడ అంటూ దెప్పిపొడించింది. 2019 ఆగస్టు 5 తర్వాత లోయలో జరుగుతున్న వాస్తవ పరిణామాలెన్నింటినో కప్పిపుచ్చడానకి భారత్ ప్రయత్నాలు చేసిందని, వీటన్నింటిని అంతర్జాతీయ సమాజం చూసిందని పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది.
చినాబ్ నదిపై రాట్లే, క్వార్ జలవిద్యుత్ కేంద్రాలకు శంకు స్థాపన చేస్తున్న సమయంలో కనీసం మాట కూడా తమకు చెప్పలేదని పాక్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడమంటే 1960 లో జల ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని పాక్ మండిపడింది.