Pahalgam attack : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) సమీపంలోగల బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి నుంచి దేశం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అశ్రునయనాలతో వీడ్కోలు పలుకుతోంది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల (Terrorists) దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభం ద్వివేది (Shubham Dwivedi) భార్య ఇషానాయ్ ద్వివేది (Eshanaay Dwivedi) ఆ భయానక ఘటనను గుర్తుచేసుకుంది. తన భర్తను ఉగ్రవాదులు కాల్చిచంపిన సందర్భాన్ని వివరించి బోరున విలపించింది.
‘విహారయాత్రలో ఉన్న తాము ఒక రెస్టారెంట్‌కు వెళ్లాం. అక్కడ మ్యాగీ ఆర్డర్ చేసి కూర్చున్నాం. అప్పుడే మా వెనుక నుంచి ఒక వ్యక్తి వచ్చి ‘మీరు హిందువులా ముస్లింలా..? మీరు ముస్లింలు అయితే ముందుగా కల్మా చదవండి’ అని గద్దించాడు. అప్పుడు మా నాన్న వాష్‌రూమ్‌లో ఉన్నాడు. ఏం జరుగుతుందోనన్న అయోమయంలో మేం వెనక్కి తిరిగి చూశాం. సాయుధుడిగా ఉన్న ఆ ముష్కరుడు వెంటనే అతను హిందువా.. ముస్లిమా..? అని నా భర్త గురించి ప్రశ్నించాడు. దాంతో నేను హిందువు అని చెప్పాను. అంతే క్షణాల్లో ఆయనను చంపేశాడు.’ అని గుర్తుచేసుకుని ఇషానాయ్ విలపించారు. తన భర్తను చంపినట్టే తనను కూడా చంపమన్నానని, కానీ ‘మా గురించి మోదీకి చెప్పేందుకు నిన్ను వదిలేస్తున్నాం’ అంటూ వెళ్లిపోయారని గుర్తుచేశారు.
ఇవాళ తెల్లవారుజాముననే శుభమ్ ద్వివేది భౌతికకాయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లోని అతడి నివాసానికి చేరుకుంది. శుభమ్ ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది ఇంకా దిగ్భ్రాంతిలోనే ఉన్నాడు. కొడుకును కోల్పోయిన బాధను అతను దిగమింగుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘నా కొడుకు, కోడలు, నా కొడుకు మరదలు, మామ పహల్గాం విహారయాత్రకు వెళ్లారు. ఓ రెస్టారెంట్‌కు వాళ్లు వెళ్లిన సమయంలో ఉగ్రవాదుల దాడి జరిగింది. నా కొడుకును చంపినప్పుడు నా కోడలు ‘నన్ను కూడా చంపేయండి’ అని ఉగ్రవాదులను వేడుకుంది. కానీ ‘మా గురించి మీ మోదీకి చెప్పుకునేందుకు సాక్ష్యంగా నిన్ను వదిలిపెడుతున్నాం’ అంటూ వెళ్లిపోయారని సంజయ్ ద్వివేది తెలిపారు.
ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదులకు అంతకంటే తీవ్రంగా బదులివ్వాలని సంజయ్ ద్విదేది అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదులపై సైన్యం చేసే ప్రతీకార దాడి వాళ్లు ఏళ్లు ఏడు తరాలపాటు గుర్తుంచుకునే స్థాయిలో ఉండాలని అన్నారు. ఏడు తరాలపాటు ఎవరినైనా చంపేందుకు వాళ్లు సాహం చేయకూడదని చెప్పారు. ఈ విషయమై తాము త్వరలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తామని తెలిపారు.