Padma Awards | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ), న్యూఢిల్లీ : వివిధ రంగాల్లో విశేష ప్రతిభను కనబరిచిన ప్రతిభామూర్తులు, సామాజిక సేవకులకు కేంద్ర ప్రభుత్వం శనివారం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ వేళ కళలు, సామాజిక సేవ, వాణిజ్యం, పరిశ్రమ, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు తదితర వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కాయి. దేశ రెండోఅత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారానికి ఏడుగురు, మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌కు 19 మంది ఎంపికయ్యారు. ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఏఐజీ దవాఖానల అధినేత డాక్టర్ దువ్వూరు నాగేశ్వర్ రెడ్డికి తెలంగాణ నుంచి పద్మ విభూషణ్ పురస్కారం వరించింది.
ప్రజావ్యవహారాల రంగంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ వరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ నటుడు బాలకృష్ణకు కళల రంగంలో పద్మభూషణ్ ప్రకటించగా, కళల రంగంలో మాడుగుల నాగఫణి శర్మ, మిర్యాల అప్పారావు (మరణానంతరం), సాహితీ రంగంలో వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి, కేఎల్ కృష్ణకు పురస్కారాలు ప్రకటించారు. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు లభించాయి. తనకు పద్మవిభూషణ్ పురస్కారం లభించడం పట్ల డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇది తనను నమ్మిన రోగులకు, ఐజీ హాస్పిటల్ సిబ్బందికి, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్టు చెప్పారు.
దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి(వైద్యం), తెలంగాణ; జస్టిస్(రిటైర్డ్) జగదీశ్ సింగ్ ఖేహర్(రాజకీయ), చండీగఢ్; కుముదినీ రజనీకాంత్ లఖియా(కళలు), గుజరాత్; లక్ష్మీనారాయణ సుబ్రమణియం(కళలు), కర్ణాటక; ఎంటీ వాసుదేవన్ నాయర్(మరణానంతరం)(సాహిత్యం-విద్య), కేరళ; ఒసాము సుజుకీ(మరణానంతరం)(వాణిజ్యం, పరిశ్రమలు), జపాన్; శారదా సిన్హా(మరణానంతరం)(కళలు), బీహార్.
ఏ.సూర్యప్రకాశ్(సాహిత్యం, విద్య-జర్నలిజం), కర్ణాటక; అనంతనాగ్(కళలు), కర్ణాటక, బిబేక్ దేబ్రాయ్(మరణానంతరం)(సాహిత్యం, విద్య), ఎన్సీటీ ఢిల్లీ; జతిన్ గోస్వామి(కళలు), అస్సాం; జోస్ చాకో పెరియప్పురం(వైద్యం), కేరళ; కైలాష్ నాథ్ దీక్షిత్(పురావస్తు), ఎన్సీటీ ఢిల్లీ, మనోహర్ జోషి(మరణానంతరం)(ప్రజావ్యవహారాల),మహారాష్ట్ర; నల్లి కుప్పుస్వామి చెట్టి(వాణిజ్యం, పరిశ్రమలు) తమిళనాడు; నందమూరి బాలకృష్ణ(కళలు), ఏపీ; శ్రీజేష్(క్రీడలు), కేరళ; పంకజ్ పటేల్(వాణిజ్యం), గుజరాత్; పంకజ్ ఉదాస్(కళలు), (మరణానంతరం), మహారాష్ట్ర; రాంబహదూర్ రాయ్(సాహిత్యం, విద్య-జర్నలిజం), ఉత్తర్ ప్రదేశ్; సాధ్వి రితంభర(సామాజిక సేవ), ఉత్తర్ ప్రదేశ్; అజిత్ కుమార్(కళలు), తమిళనాడు, శేఖర్‌కపూర్(కళలు), మహారాష్ట్ర; శోభన (కళలు), తమిళనాడు; సుశీల్ కుమార్ మోదీ(మరణానంతరం), (రాజకీయ), బీహార్; వినోద్ ధామ్((సైన్స్, టెక్నాలజీ), అమెరికా.
దువ్వూరు నాగేశ్వర్‌రెడ్డి ఏపీలోని విశాఖపట్నంలో జన్మించారు. కర్నూల్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఛండీగఢ్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీలో పీజీ చేశారు. గ్యాస్ట్రోఎంటరాలజీలో ప్రపంచంలోని అత్యుత్తమ వైద్యుల్లో ఒకరిగా ఆయనకు పేరుంది. 2002లో ఆయనకు పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలు లభించాయి. గ్యాస్ట్రో ఎంటరాలజీలో అత్యున్నత పురస్కారాన్ని సైతం ఆయన అందుకున్నారు. 2009లో అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రోఇన్‌టెస్టినల్ ఎండోస్కోపీ(ఏఎస్‌జీఈ) ఆయనకు మాస్టర్ ఎండోస్కోపిస్ట్ అవార్డును అందించింది. ఎండోస్కోపీ రంగంలో ఈ అవార్డును నోబెల్ బహుమతిగా అభివర్ణిస్తారు. జీర్ణకోశ వ్యాధులపై ఆయన అనేక పరిశోధనలు జరపడంతో పాటు వందలాది ఉపన్యాసాలతో ప్రజలకు అవగాహన కల్పించారు.
నాలుగు దశాబ్దాలుగా దళిత ఉద్యమాల్లో ముందుండి పోరాడుతున్న మంద కృష్ణమాదిగ వరంగల్ జిల్లాలోని శాయంపేటలో జన్మించారు. 1980లలో కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటాన్ని మొదలుపెట్టారు. దళిత ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. రిజర్వేషన్లలో మాదిగలకు సరైన వాటా అందాలంటే ఎస్సీ వర్గీకరణ జరగాలనే డిమాండ్‌తో 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మెర్పీఎస్)ను స్థాపించారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం వందలాది కార్యక్రమాలు, పోరాటాలు చేశారు. ఎస్సీల వర్గీకరణ చేసే అధికారం రాష్ర్టాలకు ఉందని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో మంద కృష్ణ మాదిగ పోరాటం విజయానికి చేరువైంది.
ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెన్నైలో జన్మించారు. బాల నటుడిగా నట ప్రస్థానం ప్రారంభించిన ఆయన ఇప్పటివరకు 100కు పైగా సినిమాల్లో నటించారు. అనేక సాంఘిక, పౌరాణిక, ప్రయోగాత్మక సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఉత్తమ నటుడిగా మూడుసార్లు నంది అవార్డులు గెలుచుకున్నారు. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. హైదరాబాద్‌లోని బసవ తారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్‌కు చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు.
మాడుగుల నాగఫణి శర్మ అనంతపురం జిల్లా కడవకొల్లు గ్రామంలో జన్మించారు. తిరుపతి రాష్ట్రీయ విద్యా పీఠం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. కొంతకాలం టీటీడీ ధర్మ ప్రచార పరిషత్తు అదనపు కార్యదర్శిగా పనిచేశారు. నాగఫణిశర్మ అవధానాల్లో దిట్ట. ఇద్దరు భారత మాజీ ప్రధానుల సమక్షంలో అవధానాలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు.
పద్మశ్రీ అవార్డులు లభించిన వారిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని వారు ఎందరో ఉన్నారు. వారిలో గోవా స్వాతంత్య్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న లిబియా లోబో సర్దేశాయ్, లింగ వివక్షతను కాదని పురుషాధిక్యత ఉన్న ధక్ వాద్యంపై 150 మంది మహిళలకు శిక్షణ ఇచ్చిన గోకుల్ చంద్ర దాస్(57) లాంటి వారు ఉన్నారు. మహిళా సాధికారతపై గళమెత్తిన 82 ఏండ్ల సాల్ల్లీహోల్కర్ మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో చేనేత పాఠశాలను స్థాపించి సంప్రదాయ నేత పనిపై వందలాది మందికి శిక్షణ ఇచ్చారు. ఇక వన్యప్రాణుల పరిశోధకుడు, మరాఠీ రచయిత మారుతీ భుజంగరావు చిటమ్పల్లి (92) పక్షులు, జంతువులు, చెట్లపై ప్రత్యేక నిఘంటువును రూపొందించారు.
జైపూర్‌కు చెందిన 68 ఏండ్ల భజన కళాకారిణి బతూల్ బేగం ప్యారిస్ టౌన్హాల్లో ప్రదర్శన ఇచ్చిన ఏకైక రాజస్థాన్ మహిళా కళాకారిణిగా పేరొందారు.డప్పు వాద్యకారుడు వేలు ఆసాన్ (58), తోలు బొమ్మలాట కళాకారిణి భీమవ్వ దొడ్డబలప్ప శిల్లేక్యాతర (96) కళా రంగానికి విశిష్ట సేవలు అందించారు. సురేందర్ నగర్ పర్మర్లో తంగల నేత కార్మికుడు పర్మార్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (64), పేద క్యాన్సర్ రోగుల కోసం ఉచితంగా సేవలందించిన కలబుర్గికి చెందిన విజయలక్ష్మీ దేశ్మానే(కర్ణాట)లను దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం వరించింది. మహారాష్ట్రలో 400 హెక్టార్ల అడవిని పరిరక్షించిన చైత్రం దేవ్చంద్ పవార్, గిరిజన సంప్రదాయ సంగీత అభివృద్ధితో పాటు వెదురుతో తయారు చేసిన బస్తర్ వేణువు సృష్టికర్త పాండిరామ్ మాండవి కూడా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోనున్నారు.
అణగారిన వర్గాల ధికారానికి ప్రతీకగా నిలిచి, తన రాజీ లేని మనస్తత్వంతో సామాజిక న్యాయ సాధన కోసం అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న పోరాటయోధులు మంద కృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు రావడం ఆయా వర్గాలకు దకిన గౌరవం. ఏఐజీ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి పద్మవిభూషణ్ అవార్డును అందుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం. వైద్య రంగంలో ఆయన చేస్తున్న కృషి అనితర సాధ్యమైనది. నటుడిగానే కాకుండా, లక్షలాది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న హీరో నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం హర్షణీయం. తమ ప్రతిభ, పట్టుదలతో సమాజానికి తమ వంతు సేవ చేస్తున్న ఈ ప్రముఖులను అవార్డులతో గౌరవించుకోవడం అంటే మనల్ని మనం సతరించుకోవడమే.
– కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
విభిన్న రంగాల్లో సేవలందించి దేశంలోనే అత్యున్నత పురస్కారాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు. వైద్య రంగంలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం గర్వకారణం. పద్మభూషణ్‌కు ఎంపికైన బాలకృష్ణ సినీరంగంలో తనదైన ముద్ర వేయడంతో పాటు బసవతారకం దవాఖాన ద్వారా క్యాన్సర్ రోగులకు సేవలందిస్తున్నారు. పద్మశ్రీకి ఎంపికైన మంద కృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ స్థాపించి, అణగారిన వర్గాల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. పద్మశ్రీకి ఎంపికైన మాడుగుల నాగఫణి శర్మ తన ప్రవచనాలు, రచనలతో సమాజాన్ని జాగృతం చేస్తున్నారు.
– హరీశ్ రావు, మాజీ మంత్రి
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషకరం. గ్యాస్ట్రోఎంటరాలజీలో ఆయన ప్రజలకు గొప్ప సేవలు అందిస్తున్నారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన మంద కృష్ణ మాదిగకు శుభాకాంక్షలు. ఎమ్మార్పీఎస్ స్థాపించి సామాజిక న్యాయం కోసం ఆయన అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.
– కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ
తెలంగాణ, ఏపీ నుంచి పద్మ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖులకు అభినందనలు.
– రేవంత్ రెడ్డి, సీఎం