Pacific Ocean | న్యూఢిల్లీ : భూమి స్వరూపంలో మార్పులు రాబోతున్నాయి. పసిఫిక్ మహాసముద్రం క్రమంగా కుంచించుకుపోతున్నది. ఇది పూర్తిగా అంతరించిపోయి, భూమి లోపలి టెక్టోనిక్ ప్లేట్స్ ఒక చోటుకు చేరుకుంటాయి. ఫలితంగా రానున్న 20-30 కోట్ల సంవత్సరాల్లో కొత్తగా సూపర్ కాంటినెంట్ ఆవిర్భవిస్తుంది. ఆస్ట్రేలియాలోని కర్టిన్ విశ్వవిద్యాలయం, చైనాలోని పెకింగ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ సూపర్కంప్యూటింగ్ మోడల్స్‌ను వినియోగించి ఈ అంచనా వేశారు. నేషనల్ సైన్స్ రివ్యూ జర్నల్‌లో ఈ నివేదిక ప్రచురితమైంది.
ఈ పరిశోధకుల్లో ఒకరైన డాక్టర్ చువాన్ హువాంగ్ మాట్లాడుతూ, ప్రతి 60 కోట్ల సంవత్సరాలకు ఒక సూపర్ కాంటినెంట్ ఏర్పడుతుందని, ఇది ఏర్పడటం కోసం 200 కోట్ల సంవత్సరాల కాలంలో భూమిపైగల ఖండాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఖండాలు కూడా మరో 20 కోట్ల సంవత్సరాల్లో మళ్లీ ఒక చోటుకు చేరుతాయని చెప్పారు. ఫలితంగా ఏర్పడే కొత్త సూపర్ కాంటినెంట్‌కు అమేసియా అని పేరు పెట్టినట్లు తెలిపారు. అమెరికా, ఆసియా ఢీకొన్నపుడు పసిఫిక్ మహాసముద్రం అంతరించిపోతుందని కొందరు విశ్వసిస్తున్నందువల్ల ఈ పేరు పెట్టామన్నారు. పసిఫిక్ మహాసముద్రం మూతపడితే, ఆస్ట్రేలియా మొదట ఆసియాను ఢీకొడుతుందని, ఆ తర్వాత అమెరికా, ఆసియా ఖండాలను కలుపుతుందని చెప్పారు.