Power bills : సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా కస్టమర్ కరెంటు (Current) ను వాడుకుంటే నెలానెలా బిల్లు చెల్లించాల్సిందే. లేదంటే సంబంధిత సిబ్బంది వచ్చి కరెంటు కనెక్షన్ కట్ చేస్తారు. అందుకే వినియోగదారులు నెలనెలా గుర్తు పెట్టుకుని మరీ బిల్లులు చెల్లిస్తారు. కానీ త్రిపుర రాష్ట్రం (Tripura state) లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఆ రాష్ట్రంలోని మొత్తం కస్టమర్లలో కనీసం సగం మంది కూడా బిల్లులు చెల్లించడంలేదు. ఈ విషయాన్ని ‘త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (TSECL)’ అధికారులు వెల్లడించారు.
త్రిపురలో మొత్తం 9,27,838 మంది విద్యుత్ వినియోగదారులు ఉండగా.. అందులో కేవలం 4,32,045 మంది మాత్రమే నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. అంటే కేవలం 40 శాతం మంది మాత్రమే కరెంటు బిల్లులు కడుతున్నారు. రాష్ట్ర రాజధాని అగర్తలా సహా పలు పట్టణ ప్రాంతాల్లో బిల్లులు బాగానే వసూలవుతున్నాయని అధికారులు తెలిపారు. ట్రైబల్ ఏరియాల్లో పెండింగ్ బిల్లులు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఫలితంగా రాష్ట్రంలో సోమవారం ఉదయం వరకు మొత్తం రూ.475 కోట్ల బిల్లులు పేరుకుపోయాయని చెప్పారు.