భువనేశ్వర్: ఒడిశాలో రెండో దశ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గందరగోళంతో ప్రారంభమయ్యాయి. ( Odisha Assembly) మాజీ సీఎం బీజు పట్నాయక్ పట్ల అగౌరవం, మహిళల భద్రత అంశాలపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. బీజేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ వెల్‌లోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 1993 నుంచి మార్చి 5న మాజీ సీఎం బీజు పట్నాయక్ జయంతిని పంచాయతీ రాజ్ దివస్‌గా ఒడిశాలో నిర్వహిస్తున్నారు. ఆ రోజును అధికారిక సెలవుగా పాటించేవారు.
కాగా, సీఎం మోహన్ చరణ్ మాఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దీనిని మార్చింది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ఏప్రిల్ 24న పంచాయతీ రాజ్ దివస్ నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే మార్చి 5న సెలవును కూడా రద్దు చేసింది. ఈ మేరకు ఉత్తర్వును ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలో బీజు పట్నాయక్‌ను అగౌరపర్చడంపై బీజేడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభలో డిమాండ్ చేశారు. ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసన చేపట్టారు.
మరోవైపు బీజేడీ ఎమ్మెల్యే అధిరాజ్ పాణిగ్రాహి, సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపతి స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. మైక్ లాక్కొనేందుకు ప్రయత్నించారు. దీంతో సభలో గందరగోళం చెలరేగడంతో రెండుసార్లు వాయిదా పడింది. అనంతరం బీజు పట్నాయక్ విగ్రహం వద్ద బీజేడీ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. అలాగే బీజేపీ పాలనలో మహిళలకు భద్రత లోపించినట్లు కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వారు నిరసన చేపట్టారు.