బెంగళూరు: బీజేపీతో జేడీ(ఎస్) పొత్తుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన పార్టీ కర్ణాటక శాఖ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంపై పార్టీ అధినేత హెచ్డీ దేవెగౌడ (H D Deve Gowda) గురువారం చర్యలు చేపట్టారు. ఆయనను పార్టీ నుంచి తొలగించారు. అలాగే జేడీ(ఎస్) రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేశారు. తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామిని పార్టీ రాష్ట్ర శాఖ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ఇబ్రహీంను తొలగించినట్లు తెలిపారు. కొత్త అధ్యక్షుడిగా హెచ్డీ కుమారస్వామిని నియమించినట్లు చెప్పారు.
కాగా, త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని జేడీ(ఎస్) నిర్ణయించింది. అయితే పార్టీ నిర్ణయాన్ని ఇబ్రహీం వ్యతిరేకించారు. ఈ నెల 16న తనతో కలిసి వచ్చే కొందరితో సమావేశమయ్యారు. పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన ఆయన తన నేతృత్వంలోని పార్టీయే అసలైందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీ(ఎస్) మధ్య పొత్తు వద్దని డిమాండ్ చేశారు. దీనిపై పార్టీ అధిష్టానానికి మెమోరాండం సమర్పించేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇబ్రహీంను పార్టీ నుంచి దేవెగౌడ తొలగించారు. జేడీ(ఎస్) రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేశారు.