Delhi Airport | తగ్గిన దృశ్య గోచరతతోపాటు అననుకూల వాతావరణ పరిస్థితుల వల్ల సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో 400పై చిలుకు విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి. అయితే విమాన సర్వీసులను ఇతర విమానాశ్రయాలకు దారి మళ్లించలేదని ఢిల్లీ విమానాశ్రయ అధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీలో దృశ్య గోచరత తక్కువగా ఉన్నా విమాన సర్వీసుల నిర్వహణపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడలేదన్నారు. ప్రయాణికులు అప్డేటెడ్ సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ అధికారి తెలిపారు. జనవరి ఏడో తేదీన ఢిల్లీ, అమృత్సర్, జమ్ము, శ్రీనగర్, గోరఖ్పూర్, వారణాసి, అయోధ్య, దర్భంగ, పాట్నా నగరాల్లో తక్కువ దృశ్య గోచరత వల్ల ఆయా నగరాలతో అనుసంధానమైన విమానాల రాకపోకలపై ప్రభావం ఉంటుందని సోమవారం సాయంత్రం 5.56గంటలకు స్పైస్ జెట్ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది.