చండీగఢ్: హర్యానా రాష్ట్రంలోని నూహ్ పట్టణంలో సోమవారం ఉదయం విశ్వహిందూ పరిషత్ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలవల్ల అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జనం ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా హింస చేలరేగడంతో ఓ వర్గానికి చెందిన దాదాపు 3 వేల నుంచి 4 వేల మంది స్థానికంగా ఉన్న నల్హార్ శివాలయంలో చిక్కుకున్నారని హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ తెలిపారు.
వారందరినీ కాపాడి ఇళ్లకు చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని హోంమంత్రి చెప్పారు. హింసాత్మక ఘటనల్లో కొంతమందికి గాయాలయ్యాయని ఆయన తెలిపారు. అల్లరిమూకలు నిప్పుపెట్టడంతో పదుల సంఖ్యలో కార్లు, బైకులు తగులబడిపోయాయని ఆయన చెప్పారు. నూహ్‌లో పరిస్థితిని అదుపు చేసి శాంతిని నెలకొల్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు.