న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కంపెనీకి చెందిన కోవాగ్జిన్(Covaxin) టీకా తీసుకున్నవారిలో మూడవ వంతు వ్యక్తులు తొలి సంవత్సరంలోనే తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడినట్లు బనారస్ హిందూ యూనివర్సిటీ తన స్టడీలో తేల్చింది. 926 మందిపై బీహెచ్‌యూ పరిశోధకుల బృందం స్టడీ చేసింది. దీంట్లో 50 శాతం మంది ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లు ఫిర్యాదు చేశారు. ఎక్కువ శాతం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. ఒక్క శాతం వ్యక్తుల్లో తీవ్రమైన ఏఈఎస్ఐతో పాటు గులియన్ బారీ సిండ్రోమ్ లాంటి లక్షణాలు కనిపించాయి.
స్ప్రింగర్ నేచర్ అనే జర్నల్‌లో బీహెచ్‌యూ నివేదికను ప్రచురించారు. ఆస్ట్రాజెనికాకు చెందిన కోవీషీల్డ్ టీకా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు ఇటీవల రిపోర్టులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోవాగ్జిన్ టీకా గురించి కూడా రిపోర్టును తయారు చేశారు. కోవాగ్జిన్ తీసుకున్న వారిలో 30 శాతం మంది ఏడాది తర్వాత ఆరోగ్య సమస్యలతో సతమతం అయినట్లు బీహెచ్‌యూ తన స్టడీలో పేర్కొన్నది.
వ్యాక్సిన్ తీసుకున్న యువతలో చర్మ, సాధారణ, నరాల సంబంధిత రుగ్మతలు వచ్చినట్లు తెలుస్తోందని స్టడీలో పేర్కొన్నారు. జనవరి 2022 నుంచి ఆగస్టు 2023 వరకు స్టడీ చేపట్టారు.బీబీవీ152 వ్యాక్సిన్ తీసుకున్న 635 మంది యుక్త వయస్కులు, 291 మంది నడి వయస్కులపై ఈ స్టడీ చేశారు.