గువాహటి : సమస్త ప్రాణుల్లోకి మానవజన్మ ఉత్తమమైందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎంతో పుణ్యం చేస్తే గానీ మానవ జన్మ లభించదని పురాణాలు, ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ఎంతో విలువైన ప్రాణాన్ని కొందరు చిన్న చిన్న తగాదాలు, కారణాలతో అర్ధాంతరంగా ముగిస్తున్నారు. అసోం రాష్ట్రంలో 2012 నుంచి ఈ ఏడాది (2022)లో ఇప్పటి వరకు 28వేల మందికిపైగా ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అసోం అసెంబ్లీలో సోమవారం ఓ ప్రశ్నకు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. కుటుంబ వివాదాలు, ఆర్థిక కారణాలు, అక్రమ సంబంధాలు సహా పలు కారణాలతో జీవితాలను అర్ధంతరంగా తీసుకుంటున్నారని విచారణలో తేలిందని చెప్పారు.
గత పదేళ్లలో 12,703 హత్య కేసులు, 111 లైంగిక దాడులు.. హత్య కేసులు, 18,519 లైంగిక దాడులు, 31,360 వేధింపులు నమోదయ్యాయని సీఎం తెలిపారు. 2017 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దొంగతనం, అత్యాచారం, కిడ్నాప్, హత్య, దోపిడీ వంటి తొమ్మిది రకాల నేరాలకు సంబంధించి మొత్తం 1,19,800 కేసులు నమోదయ్యాయని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2011 -2016 మధ్య ఇలాంటి నేరాల సంఖ్య 85,224గా ఉండేదని, 2016 నుండి ఫిబ్రవరి 28, 2022 వరకు 10,651 సైబర్ క్రైమ్ కేసులూ నమోదయ్యాయి. ఈ కాలంలో 1,374 అరెస్టులు జరిగాయి. 2011 – 2016 వరకు 1,467 సైబర్ కేసులు నమోదయ్యాయి.