గువహటి : భారీ వరదలకు అసోం అతలాకుతలమవుతోంది. మంగళవారం కుండపోత వర్షం కురియడంతో.. వరద మరింత ఎక్కువైంది. 24 జిల్లాల్లో 2,02,385 మంది నిరాశ్రయులయ్యారు. అసోం విపత్తుల నిర్వహణ శాఖ ప్రకారం.. 811 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 1,277 ఇండ్లు ధ్వంసం అయ్యాయి. మరో 5,262 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.
గడిచిన 24 గంటల్లో 20 జిల్లాల్లో 1.97 లక్షల మంది వరద ప్రభావానికి గురైనట్లు తెలిపింది. దిమా హసవో, కరీంగంజ్, హయిలాకండి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. నాగౌన్ జిల్లాలో వరద నీరు భారీగా చేరడంతో.. 16 వేల మంది నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు. స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాల్లో నిరాశ్రయులకు ఆవాసం కల్పిస్తున్నారు. బ్రహ్మపుత్ర నది డేంజర్ లెవల్లో ప్రవహిస్తోంది.