NGO FCRA Licence | దేశవ్యాప్తంగా 6 వేల పైగా స్వచ్ఛంద సంస్థలు విదేశీ విరాళాలు పొందే అర్హతను కోల్పోయాయి. మదర్‌థెరిస్సా మిషనరీస్ ఆఫ్ చారిటీ లైసెన్స్ పునరుద్ధరించలేదని వార్తలొచ్చిన కొన్ని రోజుల తర్వాత కేంద్ర హోంశాఖ శనివారం జారీ చేసిన ఓ ప్రకటనలో ఆక్స్‌ఫామ్, జామియా తదితర స్వచ్ఛంద సంస్థలు కూడా విదేశీ విరాళాలు పొందే అర్హత కోల్పోయాయని తెలిపింది. విదేశీ విరాళాల (నియంత్రణ) చట్టం ప్రకారం లైసెన్స్ పొందిన స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే విదేశీ విరాళాలు లభిస్తాయి.
2020 సెప్టెంబర్ 29 నుంచి 2021 డిసెంబర్ నెలాఖరు నాటికి 18,778 ఆర్గనైజేషన్లు.. ఎఫ్సీఆర్ఏ లైసెన్స్‌లు కోల్పోయాయి. వాటిల్లో 12,989 సంస్థలు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకున్నాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. శుక్రవారం 5,789 సంస్థల లైసెన్స్‌ల గడువు దాటిపోయింది. దీంతో ఆయా సంస్థల్లో ఒకటి కూడా తమ లైసెన్స్‌ల పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోలేదని హోంశాఖ వర్గాలు తెలిపాయి. శుక్రవారంతో గడువు ముగుస్తుందని, లైసెన్సు పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకోవాలని గుర్తు చేసినా స్పందించలేదని ఆ వర్గాల కథనం. మదర్ థెరిస్సా చారిటీ సంస్థతోపాటు 179 సంస్థల దరఖాస్తులను హోంశాఖ వర్గాలు తిరస్కరించినట్లు సమాచారం. .
ఆక్స్‌ఫామ్ ఇండియా ట్రస్ట్, జామియా మిలియా ఇస్లామియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, లెప్రసీ మిషన్, టీబీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, ఐఐటీ-ఢిల్లీ తదితర సంస్థలకు ఇప్పుడు ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ లేదు. ఆక్స్‌ఫామ్ ఇండియా, ఆక్స్‌ఫామ్ ఇండియా ట్రస్ట్ లైసెన్స్ గడువు పూర్తయిందే తప్ప, వాటిని రద్దు చేయలేదని హోంశాఖ వర్గాలు చెప్పాయి.
కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మిషనరీస్ ఆఫ్ చారిటీస్ అనుబంధ సంస్థ గుజరాత్లో యువతుల మత మార్పిడికి పాల్పడుతున్నదని కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తమ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ కోసం దాఖలు చేసిన దరఖాస్తు తిరస్కరణకు గురైందని మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ధృవీకరించింది. దీనిపై వివాదం పరిష్కారం అయ్యే వరకు విదేశీ విరాళాలు స్వీకరించొద్దని తమ అనుబంధ సంస్థలను మిషనరీస్ ఆఫ్ చారిటీస్ కోరింది.