Aadhar | ఇక నుంచి అప్పుడే పుట్టిన శిశువులకు ఆధార్ కార్డ్ జారీ చేయడం మరింత తేలికవుతుంది. పుట్టగానే దవాఖానల్లోనే ఆధార్ జారీ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భారత్ విశిష్ట గుర్తింపు ప్రాదికార సంస్థ (ఉడాయ్) సీఈవో సౌరవ్ గార్గ్ చెప్పారు. ఇందుకు రిజిస్టార్ ఆఫ్ బర్త్ విభాగంతో సంప్రదిస్తున్నామని ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పుడే పుట్టిన పిల్లల ఫొటోలను దవాఖానలోనే తీసుకుని ఆధార్ కార్డు జారీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఐదేండ్లలోపు బాలలకు బయోమెట్రిక్ అవసరం లేదన్నారు. తల్లిదండ్రుల్లో ఒకరి ఆధార్ కార్డుతో అనుసంధానిస్తామని సౌరవ్ గార్గ్ అన్నారు. ఐదేండ్లు పూర్తయ్యాక చిన్నారుల బయో మెట్రిక్ తీసుకుంటామన్నారు. ఇప్పటికే 131 కోట్ల మందికి ఆధార్ కార్డు జారీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రతిఏటా 2-2.5 కోట్ల మంది కొత్తగా జన్మిస్తున్నారన్నారు. వారు పుట్టగానే ఆధార్ నంబర్ కేటాయించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయని సౌరవ్ గార్గ్ చెప్పారు.