న్యూఢిల్లీ: ఓటీటీల్లో అశ్లీల కంటెంట్ కట్టడికి కేంద్రం చర్యలు చేపట్టింది. అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తున్న 25 యాప్‌లు, వెబ్సైట్లపై నిషేధం విధించింది. ఈ జాబితాలో ఉల్లు, ఏఎల్టీటీ, దేశీఫ్లిక్స్ వంటివి ఉన్నాయి. ఐటీ రూల్స్, అశ్లీల నిషేధ చట్టాలను ఇవి ఉల్లంఘిస్తూ ‘సాఫ్ట్ పోర్న్’ వంటి కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. ‘కామోద్దీప వెబ్ సిరీస్’ ముసుగులో ఈ యాప్‌లు కంటెంట్‌పై నియంత్రణ లేకుండా వయోజనులకు సంబంధించిన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయని పలు ఫిర్యాదులు అందడంతో ఐటీ శాఖ ఈ చర్యలు తీసుకుంది.
అశ్లీల కంటెంట్ ముఖ్యంగా మైనర్లకు సులభంగా అందుబాటులో ఉండకుండా నిరోధించడం కోసం ఈ నిషేధాన్ని విధించారు. హోం, మహిళా, శిశు సంక్షేమం, న్యాయ శాఖలతో పాటు మహిళలు, పిల్లల హక్కుల కార్యకర్తలతో సంప్రదింపులు జరిపాక ఈ నిర్ణయం తీసుకున్నారు. నిషేధిత ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల జాబితాలో ఉల్లు, ఏఎల్టీటీ, దేశీ ఫ్లిక్స్, బిగ్ షాట్స్ యాప్, గులాబ్ యాప్ ఉన్నాయి.