న్యూఢిల్లీ, మే 1: భారత్లో క్యాన్సర్ మహమ్మారి విస్తరిస్తున్నది. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ‘ఐసీఎంఆర్’ (భారత వైద్య పరిశోధన మండలి) తాజాగా జరిపిన ప్రపంచ విశ్లేషణలో వెల్లడైంది. భారత్ సహా జీ 20లోని 11 దేశాలకు చెందిన గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2022 డాటాను ఐసీఎంఆర్ పరిశోధకులు విశ్లేషించగా, భారత్లో క్యాన్సర్ కేసుల భారం క్రమంగా పెరుగుతున్నది. భారత్లో పెరిగినట్టుగానే జీ 20 దేశాల్లోనూ పురుషుల్లో నోటి క్యాన్సర్ కేసుల పెరుగుదల నమోదైంది.
భారత్లో నోటి క్యాన్సర్ కేసులు పురుషుల్లో ఏటా 1.20 శాతం చొప్పున పెరుగుతున్నాయి. జీ-20 దేశాలైన చైనా (1.10శాతం), కెనడా (0.94శాతం), అమెరికా (0.57శాతం)తో పోలిస్తే భారత్లోనే ఈ పెరుగుదల ఎక్కువగా ఉంది. దీనిపై ఐసీఎంఆర్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ మాథూర్ మాట్లాడుతూ, ‘గుట్కా, పాన్, ఖైనీ వంటి నమిలే పొగాకు ఉత్పత్తుల వాడకం ప్రధాన కారణం. మద్యపానం, వక్క నమలడం.. వంటి వ్యసనాలూ క్యాన్సర్ బారిన పడేస్తున్నాయి. చిన్నవయసులో ఈ అలవాట్లు ప్రారంభమై, సామాజికంగా పాతుకుపోవటం ప్రధాన సమస్యగా మారింది’ అని అన్నారు.