న్యూఢిల్లీ, ఆగస్టు 31: కృత్రిమ మేధ(ఏఐ) మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా అప్పులు చేస్తున్న నేపథ్యంలో వేతన వ్యయాలను తగ్గించుకునేందుకు ఒరాకిల్ మరో విడత ఉద్యోగాల కోతకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. అంతర్జాతీయంగా మార్చి నెలలో దాదాపు 20,000 నుంచి 30,000 మంది ఉద్యోగులను తొలగించిన ఈ అమెరికన్ టెక్ దిగ్గజం ఇప్పుడు మరోసారి ఉద్యోగులపై వేటుకు సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీ(మంగళవారం) కీలకమైనదిగా కనిపిస్తున్నది.
తొలగించగల ఉద్యోగాలను గుర్తించవలసిందిగా మేనేజర్లను కోరినట్టు సమాచారం. దీంతో ఒరాకిల్ మార్చి కోతల సమయంలో వచ్చిన ఉదయపు తొలగింపు ఈమెయిల్సే మళ్లీ ఉద్యోగులకు ఎదురవుతాయేమోనన్న భయాలు పెరుగుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం కొత్త త్రైమాసికం ప్రారంభం కాగానే జీతాల కోతలను అమలు చేయాలని ఒరాకిల్ భావిస్తున్నది. అయినప్పటికీ సెప్టెంబర్ 1న సామూహిక తొలగింపు జరుగుతుందని ఒరాకిల్ ఇప్పటివరకు ధృవీకరించలేదు.
ఒరాకిల్ ఇప్పటికే సుమారు 21,000 ఉద్యోగాలను తగ్గించింది. 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్న తర్వాత ఈ తాజా వార్తలు వెలువడ్డాయి. కంపెనీలో ఉద్యోగుల సంఖ్య సుమారు 1.62 లక్షల నుంచి 1.41 లక్షలకు తగ్గింది. అంటే కంపెనీ తన సిబ్బంది సంఖ్యను సుమారు 21,000మంది మేర తగ్గించుకుంది. కేవలం భారత్‌లోనే దాదాపు 12,000 మందిపై వేటు పడినట్టు తెలుస్తున్నది. ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై తన వ్యయాన్ని ఏకకాలంలో పెంచుతున్న తరుణంలో ఈ కోతలు వచ్చాయి. ఇదే కాలంలో కంపెనీ గణనీయమైన పునర్నిర్మాణ ఖర్చులను కూడా వెల్లడించింది. సాంకేతిక రంగంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలలో ఒరాకిల్ చేపట్టిన ఉద్యోగుల కుదింపు ఇప్పటికే అత్యంత ప్రధానమైన అంశాలలో ఒకటిగా నిలిచింది.
ఏమిటీ మార్నింగ్ ఈ-మెయిల్?
ఉద్యోగులు ఉదయాన్నే లేఆఫ్ నోటిఫికేషన్లను అందుకున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో ఉదయం 6 గంటల ఈమెయిల్ అనే పదం ఒరాకిల్‌తో ముడిపడిపోయింది. మేనేజర్‌తో సమావేశం ద్వారా తమ ఉద్యోగ స్థితి గురించి తెలుసుకోవడానికి బదులుగా కొంతమంది ఉద్యోగులు ఒరాకిల్ నాయకత్వం నుంచి వచ్చిన ఈమెయిల్‌ను తెరిచినపుడు తమ టెర్మినేషన్ గురించి తెలుసుకున్నారు.
జొమాటోలో 250 మందికి ఉద్వాసన
తెలుగు కస్టమర్ సపోర్ట్ సెంటర్ ఎత్తివేత
హైదరాబాద్ : ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో హైదరాబాద్‌లో తెలుగు కస్టమర్ కేర్ సపోర్ట్ సెంటర్‌ను ఎత్తేసింది. కస్టమర్ కేర్‌లో పనిచేస్తున్న 250 మంది ఉద్యోగులకు సోమవారం ఈ సమాచారం ఇచ్చింది. బయటి భాగస్వామ్యులతో తక్కువ ఖర్చుతోనే కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను నిర్వహించాలని జొమాటో నిర్ణయించుకుంది. పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జొమాటో తెలిపింది. ఉద్యోగ విరమణ పరిహారంతో పాటు కొత్త ఉద్యోగాలు పొందేందుకు సహాయం అందిస్తామని జొమాటో తెలిపింది.