న్యూఢిల్లీ, ఆగస్టు 20: తీవ్ర నేరారోపణలతో అరెస్టయి వరుసగా 30 రోజులు నిర్బంధంలో ఉన్న రాష్ర్టాల ముఖ్యమంత్రులు, మంత్రులను పదవి నుంచి తప్పించే అధికారాలను గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు కట్టబెడుతూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన వివాదాస్పద రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, 2025పై విపక్షాలకు చెందిన ఎంపీలు నిప్పులు చెరిగారు.
బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలలోని ప్రభుత్వాలను కూల్చడానికి నేరుగా సీబీఐ, ఈడీని అనుమతించేందుకే మోదీ ప్రభుత్వం ఈ బిల్లులను తీసుకువచ్చిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. విపక్ష పాలిత రాష్ర్టాలలోని ప్రభుత్వాలను కూల్చడానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా కొత్త ఎత్తులు వేస్తున్నారని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపించారు.
ఓట్ చోరీ బయటపడడంతో మోదీ, షా కొత్త ఎత్తులు వేస్తున్నారని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి నేరస్థుడని తేలేది న్యాయస్థానం శిక్ష విధించిన తర్వాతేనని, అప్పటి వరకు ఆ వ్యక్తి నిందితుడు మాత్రమేనని గోఖలే స్పష్టం చేశారు. హోం మంత్రి ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లులు ఫెడరల్ వ్యవస్థను, న్యాయవ్యవస్థను అతిక్రమిస్తున్నాయని మరో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా విమర్శించారు.
ప్రతిపక్షాల జోస్యాలు ఫలిస్తున్నాయి. 240 మంది ఎంపీలతో బీజేపీ రాజ్యాంగాన్ని మార్చేస్తోంది. బూటకపు ఆరోపణలతో ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులను ఈడీ, సీబీఐ అరెస్టు చేస్తాయి. దోషిని అని కోర్టు తేల్చకముందే వారిని పదవుల నుంచి తొలగిస్తారు అని మొయిత్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివాదాస్పద బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన వెంటనే ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందిస్తూ భారతదేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చే ప్రయత్నమే ఈ బిల్లని ఆగ్రహించారు. అల్పమైన ఆరోపణలు, అనుమానాలను ఆధారంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలు తామే న్యాయమూర్తిగా శిక్షను అమలు చేసే వ్యవస్థగా మారేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. పోలీసు రాజ్యాన్ని తయారుచేయాలని మోదీ ప్రభుత్వం నిశ్చయంతో ఉందని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను చావుదెబ్బ కొట్టేందుకు ప్రభుత్వం పూనుకుంటోందని ఆరోపించారు.
130వ రాజ్యాంగ సవరణ బిల్లును నల్ల బిల్లుగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. అధికారంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులపై కేసులు బనాయించి వారిని గద్దె దించడమే ఈ బిల్లు అసలు ఉద్దేశమని ఆయన ఆరోపించారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని మధ్యయుగాలకు తీసుకువెళుతున్నట్లు కనపడుతోందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. పూర్వకాలంలో రాజుకు తన ఇష్టానుసారం ఎవరినైనా తొలగించేవాడని అన్నారు. ఇప్పుడు 30 రోజుల తర్వాత ప్రజాస్వామికంగా ఎన్నికైన వ్యక్తిని బయటకు విసిరేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.