న్యూఢిల్లీ, బెంగళూరు, పాట్నా, అక్టోబర్ 8: భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో గురువారం పలు చోట్ల భారీ నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు నిర్వహించారు.
బెంగళూరులో సీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో సీజేపీ వ్యవప్థాపకుడు అభిజీత్ దీప్కే, నటుడు ప్రకాశ్ రాజ్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ పాల్గొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఎంపీలు రాజ్‌ఘాట్‌కు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీహార్‌లో కూడా కూటమి నేతృత్వంలో చలో లోక్‌భవన్ జరిపారు.
ప్రభుత్వం ప్రతిపాదించిన ‘ఒక దేశం-ఒక ఎన్నిక’ నినాదాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా విమర్శించారు. సర్‌కు వ్యతిరేకంగా పౌర సమాజ బృందం, సీజేపీ బెంగళూరు ఫ్రీడమ్ పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ నియంత అడాల్ఫ్ హిట్లర్ పేరును ఆయన ప్రస్తావించారు. మోదీ పాలనను హిట్లర్ రాజకీయ పాలనతో పోల్చారు.
‘భారత దేశంలోని వ్యవస్థలను ఎలా నాశనం చేయాలన్న దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒకే దేశం-ఒకే ఎన్నిక అనేది నినాదం. కానీ దేశంలో ఒక్క జాతీయ పార్టీ మాత్రమే ఉండాలన్నది దాని ఉద్దేశం. ఆ ఉద్దేశం హిట్లర్‌ది. హిట్లర్‌కు ఏమైందో చూడాలని మోదీని కోరుతున్నాను’ అని దీప్కే పేర్కొన్నారు. ప్రధాని మోదీ, ఎన్నికల సంఘం ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని, ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్నాయని దీప్కే విమర్శించారు.
ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ తప్పుకుంటే మరో అజ్ఞానేశ్ ఆ స్థానంలోకి వస్తాడని, కేవలం ఈసీఐని తొలగించినంత మాత్రన ‘సర్’లో ఉన్న లోపాలు, తప్పులు సమసిపోవని నటుడు ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. బెంగళూరులో ఆయన మాట్లాడుతూ ‘మన పోరాటం కేవలం జ్ఞానేశ్ రాజీనామాకే కాదు. జ్ఞానేశ్ ఆ పదవిలోంచి తప్పుకుంటే మరో అజ్ఞానేశ్ ఆ స్థానంలోకి వస్తారు. ‘సర్’ని పూర్తిగా రద్దు చేయాలన్నదే మా డిమాండ్’ అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల తరపున పనిచేస్తున్న జ్ఞానేశ్ తన చర్యలతో ఓటర్లను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. ఐదేండ్ల కొకసారి ఓటేయమంటూ ప్రజల వద్దకు వచ్చే నేతలు.. ఇప్పుడు పౌరుల ఓట్లు పోయినా ఇదేంటని మాత్రం అడగటం లేదని, వారికి అండగా రావడం లేదని ఆయన విమర్శించారు. ఓటర్ల లిస్టు నుంచి వేలాది మంది గిరిజనులు, పేదలు, ముస్లింలు, ఇతర మైనారిటీల ఓట్లను తొలగించారన్నారు. ఇది ప్రజల హక్కుల కోసం జరిపే పోరాటమే తప్ప, ఏ పార్టీకో అనుకూలంగా చేస్తున్నది కాదని అన్నారు.
సర్ ప్రక్రియ విషయంలో ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి పారదర్శకత కానీ, జవాబుదారీతనం కానీ లేవని యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ఆరోపించారు. ‘దేశంలోని అర్హుడైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండాలని మీరు కనుక కోరుకుంటుంటే మీరు కూడా దీనికి మద్దతు ఇచ్చి మా ఆందోళనలో పాల్గొనండి’ అని ఆయన కోరారు.
ఎన్నికల వ్యవస్థను పరిరక్షించడానికి విపక్షం పోరాడుతుందని, సీఈసీ రాజీనామా చేసేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు మూడో రోజూ ఢిల్లీలోని రాజ్‌ఘాట్, జంతర్ మంతర్ల్లో ఆందోళన నిర్వహించారు.