న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్‌పై అభిశంసన తీర్మానం కోసం రాజ్యసభలో విపక్ష పార్టీల ఎంపీలు నోటీసు ఇచ్చారు. శుక్రవారం రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను కలిసి నోటీసును అందజేశారు. కపిల్ సిబల్, దిగ్విజయ్ సింగ్, సాకేత్ గోఖలే, రాఘవ్ చద్ధా సహా 55 మంది ప్రతిపక్ష ఎంపీలు ఈ నోటీసుపై సంతకం చేశారు.
న్యాయమూర్తుల(విచారణ) చట్టం – 1968తో పాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 218 కింద అభిశంసన తీర్మానానికి నోటీసు అందజేశారు. విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ దేశ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ విద్వేష ప్రసంగం చేశారని, మత సామరస్యాన్ని దెబ్బతీశారని నోటీసులో పేర్కొన్నారు. మైనారిటీలను ఆయన లక్ష్యంగా చేసుకున్నారనేది ప్రాథమికంగా కనిపిస్తున్నదని పొందుపరిచారు.