దర్బంగా: బీహార్‌లో దారుణ హత్యా(Bihar Murder) ఘటన జరిగింది. 25 ఏళ్ల నర్సింగ్ స్టూడెంట్ను .. దర్భంగా మెడికల్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న రాహుల్ కుమార్‌ను .. అతని మామే కాల్చి చంపాడు. పాయింట్ బ్లాంక్ రేంజ్ లో .. కూతురు తన్నూ ప్రియా ముందే షూట్ చేశాడు. రాహుల్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తన్నూ ప్రియా ఫస్ట్ ఇయర్ నర్సింగ్ చేస్తోంది. అయితే ఆ ఇద్దరూ కొన్ని నెలల క్రితం కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.
కాలేజీ ఆవరణలోనే ఈ మర్డర్ జరిగింది. తన్నూ తండ్రి ప్రేమ్‌శంకర్ ఝాను విద్యార్థులు చితకబాదారు. అతనికి ప్రస్తుతం పాట్నా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్న కొత్త జంట.. ఒకే హాస్టల్ బిల్డింగ్‌లోని వేర్వేరు ఫ్లోర్లలో ఉంటున్నారు. ఓ వ్యక్తి హుడీ ధరించి రాహుల్ వద్దకు వస్తున్నట్లు గమనించానని, అయితే ఆ వ్యక్తి తన తండ్రే అని ఆలస్యంగా తెలుసుకుంటున్నట్లు తన్నూ చెప్పింది. గన్‌తో వచ్చిన నాన్న.. తన భర్తను ఛాతిలో కాల్చేశాడని, తన కండ్ల ముందే ఆ హత్య జరిగినట్లు ఆమె పేర్కొన్నది. తన భర్త తన వడిలోనే పడిపోయినట్లు ఆమె వెల్లడించింది.
తన్నూ తండ్రిపై కాలేజీలో అటాక్ జరగడంతో అక్కడకు పోలీసులు చేరుకున్నారు. అతన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు మొదలుపెట్టినట్లు ఎస్పీ జగన్నాథ్ రెడ్డి తెలిపారు. తన ఇంట్లోవాళ్లు హత్యకు కుట్ర పన్నినట్లు తన్నూ పేర్కొన్నది.