Pakistan Drones | న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్ వరుసగా రెండోరోజు భారత్‌పై డ్రోన్ల దాడికి దిగింది. సరిహద్దు రాష్ర్టాలైన జమ్ముకశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్‌లోని 20 నగరాలు లక్ష్యంగా శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో డ్రోన్లు దూసుకొచ్చాయి. అవంతిపురా వైమానిక స్థావరంపై దాడి యత్నాన్ని భారత్ నిర్వీర్యం చేసింది. భారత్ తక్షణమే పలు ప్రాంతాల్లో తన గగనతల రక్షణ వ్యవస్థను రంగంలోకి దించింది. పాక్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లను కూల్చివేసింది. డ్రోన్లు కనిపించిన వెంటనే ఆయా నగరాల్లో సైరన్లు మోగడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేసి బ్లాక్అవుట్ విధించారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి కుప్వారా, సాంబా, పూంచ్, ఫెరోజ్‌పూర్, ఉరి, నౌగాం, హంద్వారా సెక్టార్లలో పాక్ సైన్యం విచక్షణారహితంగా కాల్పులకు దిగింది.
జమ్ముకశ్మీర్‌లో జమ్ము, సాంబా, రాజౌరీ, పంజాబ్‌లోని పఠాన్‌కోట్, అమృత్సర్, రాజస్థాన్‌లోని పోఖ్రాన్ వద్దకు వచ్చిన పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. జమ్ములో గంట వ్యవధిలో వంద వరకు డ్రోన్లను కూల్చివేసినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. అవంతిపురా ఎయిర్‌బేస్ వద్ద, దక్షిణ కశ్మీర్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్టు పేర్కొన్నాయి. మన గగనతల రక్షణ వ్యవస్థ శత్రుదేశపు డ్రోన్లను ఢీకొన్నప్పుడు ఆ పేలుడు శబ్దం వెలువడినట్టు వివరించాయి. ఉధంపూర్‌లో కూడా డ్రోన్లను కూల్చివేశామని వెల్లడించాయి. శ్రీనగర్‌లోని ఓ మసీదు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రజలను బయటకు రావొద్దని, దీపాలు వెలిగించవద్దని హెచ్చరించారు. అమృత్‌సర్‌లో కూడా డ్రోన్లతోపాటు క్షిపణులను అడ్డుకొన్నామని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
రాజస్థాన్‌లో పదుల సంఖ్యలో డ్రోన్లు
రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో పాక్ పదుల సంఖ్యలో ప్రయోగించిన డ్రోన్లను భారత్ కూల్చివేసింది. డ్రోన్ల దాడి నేపథ్యంలో అధికారులు సరిహద్దు జిల్లాల్లో రెడ్ అలర్ట్, బ్లాక్అవుట్ ప్రకటించారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. డ్రోన్లు కనిపించగానే జైసల్మేర్, పోఖ్రాన్తోపాటు పలు పట్టణాల్లో సైరన్లు మోగాయి. ముందుగా అర్ధరాత్రి నుంచి బ్లాక్అవుట్ ఉంటుందని ప్రకటించినప్పటికీ డ్రోన్లు కనిపించగానే రాత్రి 9.00 గంటలకే విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు.
పేలుళ్ల శబ్దం వినిపించింది: ఒమర్ అబ్దుల్లా
జమ్ములోని పలు ప్రాంతాల నుంచి పేలుళ్ల శబ్దం వినిపించిందని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని, వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తమకు తెలిసిన సమాచారాన్ని ఇతరులకు పంపించవద్దని కోరారు.
పంజాబ్‌లోని 4 జిల్లాలలో బ్లాక్ అవుట్
ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, హోషియార్పూర్తోసహా పంజాబ్‌లోని అనేక ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం ప్రభుత్వం విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేసి బ్లాక్అవుట్ విధించింది. పఠాన్‌కోట్, ఫిరోజ్‌పూర్ జిల్లాలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఫిరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృత్సర్, హోషియార్పూర్ జిల్లాలలో వైమానిక దాడులు జరగవచ్చన్న హెచ్చరికగా సైరన్లు మోగించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, జమ్ము, పఠాన్కోట్తోసహా వివిధ ప్రదేశాలలోని సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు గురువారం రాత్రి పాకిస్థాన్ చేసిన ప్రయత్నాన్ని భారతీయ దళాలు భగ్నం చేశాయి.