Operation Tiger | బీహార్‌లో గ్రామస్థులను ముప్పుతిప్పలు పెడుతున్న పులిని పట్టుకునేందుకు ఆపరేషన్ బాగ్‌ను చేపట్టారు. బగాహా ప్రాంతంలోని చెరుకు తోటలోకి పారిపోయి దాక్కున్న పులిని మట్టుబెట్టేందుకు 10 మంది షూటర్లు రంగంలోకి దిగారు. తోటలో ఉచ్చును బిగించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ పులి పంజాకు చిక్కి ఇప్పటివరకు 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
శుక్రవారం నాడు ఇంటి నుంచి బయటకు వచ్చిన తల్లీకుమారుడ్ని ఈ పులి పొట్టపెట్టుకున్నది. గేదెలకు గడ్డి కోసి తీసుకెళ్లేందుకు తల్లి తన 10 ఏండ్ల కుమారుడితో అడవి వైపు రాగా పులి దాడి చేసి ఇద్దర్నీ హతమార్చింది. కాగా, గత మూడు రోజులుగా నలుగురిని చంపినట్లుగా తెలుస్తున్నది. గ్రామస్థులు అరవడంతో గోవర్ధనగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బలువా గ్రామ శివారులోని చెరుకు తోటలోకి పారిపోయి అక్కడే తిష్టవేసింది. ఈ చెరుకు తోటను స్థానిక అటవీ అదికారులు, పోలీసుల బృందం చుట్టుముట్టింది.
వాల్మీకినగర్ టైగర్ రిజర్వ్ (వీటీఆర్) నుంచి జనంలోకి పులిని పట్టుకునేందుకు 8 మంది షార్ప్ షూటర్లు, నలుగురు శిక్షణ పొందిన సైనికులు రంగంలోకి దిగారు. పట్నాకు చెందిన నలుగురు ఎస్టీఎఫ్ షూటర్లు కూడా మాటు వేసి ఉన్నారు. దాదాపు 200 మంది అటవీ సిబ్బంది పొలం చుట్టూ మొహరించారు. గ్రామస్థులు ఎవరూ అటు వైపు రాకుండా నిరోధించేందుకు దాదాపు 80 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. ఇళ్ల నుంచి గ్రామస్థులు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.