OpenAI : ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ టెక్ ప్రపంచంలో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చాట్‌జీపీటీని క్రియేట్ చేసిన ఓపెన్ఏఐ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించిన కంపెనీ సహ వ్యవస్ధాపకుడు జాన్ షుల్మాన్ కంపెనీని వీడారు. ఓపెన్ఏఐ నుంచి వైదొలగిన షుల్మాన్ ప్రత్యర్ధి కంపెనీ ఆంత్రోపిక్‌లో చేరనున్నారు. కంపెనీ వ్యవస్ధాపక సభ్యులు ఓపెన్ఏఐని వీడటం ఇదే తొలిసారి కాదు.
ఏఐ కంపెనీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన అంద్రెజ్ కర్పతి ఫిబ్రవరిలో ఓపెన్ఏఐ నుంచి వైదొలగి జులైలో ఏఐ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. దీనికి ముందు ఓపెన్ఏఐ సహ వ్యవస్ధాపకుడు, చీఫ్ సైంటిస్ట్ ఇలియా సుట్స్కేవర్ మేలో కంపెనీకి రాజీనామా చేశారు. కాగా తాను ఓపెన్ఏఐని వీడి ఆంత్రోపిక్‌లో చేరుతున్నట్టు షుల్మాన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.
ఓపెన్ఏఐలో కీలక పాత్ర పోషించిన షుల్మాన్ కంపెనీకి గుడ్‌బై చెప్పడంతో ఓపెన్ఏఐ భవిష్యత్ ప్రస్ధానం ఎలా ఉంటుందనే విషయంలో పలు ఊహాగానాలు సాగుతున్నాయి. ఇక ఓపెన్ఏఐ వ్యవస్ధాపకుల్లో ఒకరైన టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ సైతం కంపెనీ ప్రారంభమైన మూడేండ్లలోనే దాని నుంచి బయటకు వచ్చారు. ఇక ఆంత్రోపిక్‌ను ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగులు కొందరు ఏర్పాటు చేశారు. ఆంత్రోపిక్ పలు సొంత ఏఐ మోడల్స్‌ను డెవలప్ చేస్తూ ఓపెన్ఏఐకి దీటైన ప్రత్యర్ధిగా ముందుకొచ్చింది.
Read More :
Mushrooms | మ్యాజిక్ మష్రూమ్‌లతో మానసిక అస్వస్థతలకు చికిత్స!