న్యూఢిల్లీ: భారత దేశ 77వ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఆపరేషన్ సిందూర్’ శకటం ప్రత్యేకంగా ఆకట్టుకున్నది. దేశ త్రివిధ దళాల సంయుక్త శక్తి సామర్థ్యాలను ఇది ప్రతిబింబించింది. ఆపరేషన్ సిందూర్‌లో (Op Sindoor tableau) ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు ఎలా ఐక్యంగా పనిచేశాయో ఈ శకటం ద్వారా ప్రదర్శించారు. క్షిపణులు, ట్యాంకులు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ ప్రతిరూపాలతో దీనిని తీర్చిదిద్దారు. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు, ఆకాశ్ వైమానిక రక్షణ వ్యవస్థలు, సుదర్శన చక్రగా అభివర్ణించే ఎస్-400 యూనిట్ల ప్రతిరూపాలను ప్రదర్శించారు. పెరుగుతున్న భద్రతా సవాళ్ల మధ్య సైనికపరంగా దేశ సంసిద్ధతపై స్పష్టమైన సందేశాన్ని ఇది ఇచ్చింది. దేశ సైనిక బలగాల ఉమ్మడి యుద్ధ సామర్థ్యాన్ని ఆపరేషన్ సిందూర్ శకటం చాటింది.
కాగా, గత ఏడాది ఏప్రిల్‌లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులతో సహా 26 మంది మరణించారు. దీనికి ప్రతికారంగా గత ఏడాది మే 7న ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో సైనిక చర్యను భారత్ చేపట్టింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తో పాటు పాకిస్థాన్ సరిహద్దులోని ఉగ్రవాద శిబిరాలను భారత త్రివిధ దళాలు ధ్వంసం చేశాయి. వంద మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
మరోవైపు ఈ సందర్భంగా పాక్ సైన్యం కవ్వింపులకు దిగింది. భారత సైనిక దళాలు ధీటుగా జవాబిచ్చాయి. పాక్‌కు చెందిన కీలక ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశాయి. దీంతో గత ఏడాది మే 10న పాకిస్థాన్ ఆర్మీ కాళ్లబేరానికి వచ్చింది. భారత్‌తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నది.