ONOE | లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం లేదని మాజీ కేంద్రమంత్రి, సీనియర్ న్యాయవాది ఈఎంఎస్ నాచియప్పన్ పార్లమెంటరీ కమిటీకి తెలిపారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పు తెస్తే సరిపోతుందని పేర్కొన్నారు. నాచియప్పన్ మాజీ కాంగ్రెస్ ఎంపీ కాగా.. ఆయన స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. ఆయన గతంలో కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని సిఫార్సు చేశారు. ఇప్పుడు ఆయన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లును పరిశీలిస్తున్న కమిటీ.. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ప్రస్తుత పదవీకాలంలోనే అమలు చేయాలని కోరారు. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎదుట ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏకకాల ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించే రాజ్యాంగ సవరణ బిల్లులోని కొన్ని నిబంధనలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలో ఎక్కడా ఏకకాలంలో, దశలవారీ ఎన్నికలపై ప్రస్తావించలేదని, కాబట్టి దాన్ని సవరించాల్సిన అవసరం లేదని కమిటీకి తెలిపారు.
రాజ్యాంగం ఎన్నికలకు సంబంధించిన అన్ని బాధ్యతలను ఎన్నికల కమిషన్‌కు అప్పగించిందని.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 14, 15లను సవరించడం ద్వారా ప్రస్తుతం చేస్తున్నట్లుగానే అసెంబ్లీ రద్దుకు ఆరు నెలల ముందు ఎన్నికలను ప్రకటించడమే కాకుండా, రద్దు తర్వాత కొన్ని నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించే అధికారం ఎన్నికల కమిషన్‌కు కల్పించవచ్చని ఆయన సూచించారు. ఇది అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల తేదీలను కలిపి ఉంచడానికి వీలు కల్పిస్తుందన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదని, అయితే ఈ ప్రక్రియను కొన్ని క్రమంగా సాధించవచ్చన్నారు. బీజేపీ, మిత్రపక్షాలు దాదాపు మూడింట రెండువంతుల రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయని సీనియర్ న్యాయవాది తెలిపారు. లోక్‌సభతో పాటు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడానికి ఈ కూటమి అంగీకరిస్తే.. ఇది కీలకమైన ముందడుగు కావొచ్చన్నారు.