PM Modi : పశ్చిమాసియా (West Asia) లో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో దద్ధరిల్లుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia) లో ఉన్న ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై స్పందించారు. మెల్బోర్న్ (Melborne) లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అన్ని ఘర్షణలు దౌత్యం, చర్చలు ద్వారానే పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మోదీ.. ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌తో కలిసి ఇండియా-ఆస్ట్రేలియా సీఈఓ ఫోరమ్‌లో ప్రసంగించారు. వాణిజ్యం, రక్షణ, విద్య సహా పలు అంశాలపై ఆల్బనీస్‌తో చర్చించారు. అలాగే స్వచ్ఛ ఇంధనాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కీలకమైన అణుశక్తి ఒప్పందంపై సంతకాలు చేశారు. భారత్‌కు ఆస్ట్రేలియా యురేనియం సరఫరా చేస్తుందని మోదీ వెల్లడించారు. క్రిటికల్ మినరల్ కారిడార్, డిఫెన్స్ ఇన్నోవేషన్ కారిడార్ ఏర్పాటుకు ప్రణాళికలను ప్రకటించారు.
ఇండో-పసిఫిక్‌లో శాంతి, సుస్థిరత, స్వేచ్ఛా నౌకాయానంపై కలిసి అడుగులు వేస్తామని ప్రధాని తెలిపారు. తాజా పర్యటన ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారత్, ఆస్ట్రేలియా ప్రజలకు ఎంతో ఇష్టమైన ఆట క్రికెట్. అందుకే ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరిగినప్పుడల్లా క్రికెట్ ప్రస్తావన వస్తూనే ఉంటుంది. తాజాగా కుదిరిన యురేనియం డీల్ నేపథ్యంలో ఆ భాషలోనే మన ప్రధాని మాట్లాడారు.
‘ప్రపంచ క్రీడా రాజధాని అయిన మెల్బోర్న్లో మనం ఈ రోజు ఉన్నాం. ఇక్కడ ఆ క్రీడల గురించి మాట్లాడకపోవడం అంటే టాస్ వేసిన తర్వాత కూడా క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కాకపోవడమే అవుతుంది. ఈ రెండు దేశాల సంబంధాలకు ఇదొక ప్రత్యేక దౌత్యపరమైన భాష. మన సమావేశాలు క్రికెట్ మ్యాచ్‌లలానే ఉంటాయి. అజెండా వన్డే మ్యాచ్‌లా, నిర్ణయాలు టీ20 అంత వేగంగా, భాగస్వామ్యం టెస్ట్ మ్యాచ్ అంత సుదీర్ఘంగా, గాఢంగా ఉంటుంది’ అని మోదీ వర్ణించారు. ఆస్ట్రేలియాతో యురేనియం డీల్ కుదిరిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు.