న్యూఢిల్లీ, ఆగస్టు 26: దేశంలో నైపుణ్య శిక్షణ వ్యవస్థను సవరించేందుకు కొత్తగా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో పట్టభద్రులలో నిరుద్యోగిత జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ గుర్తించింది. సాధారణంగా ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలను పెద్దగా కల్పించని బీఏ, బీఎస్సీ, బీకాం వంటి డిగ్రీలపై అధికంగా ఆధారపడటం ఈ సమస్యకు ఒక కారణంగా నిలుస్తున్నదని నీతి ఆయోగ్ పేర్కొంది. హరిత పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాలు వంటి అధిక వృద్ధి రంగాలలో ప్రత్యేకమైన, ఉద్యోగానుసంధాన కార్యక్రమాల వైపు పయనించాలని, అలాగే అప్రెంటిస్షిప్లపై మరింత దృష్టిపెట్టాలని పేర్కొంటూ భారత్లో 90 శాతానికి పైగా పట్టభద్రులు వారి అర్హతలకు అనుగుణంగా లేని ఉద్యోగాలలో నిమగ్నమై ఉన్నారని నీతి ఆయోగ్ తెలిపింది.
దేశంలోని ఉన్నత సాంకేతిక విద్యా వ్యవస్థలో బోధించే విషయాలకూ, కార్మిక మార్కెట్ డిమాండ్ చేసే వాటికి మధ్య ఒక ప్రాథమిక అంతరం ఉంది. చాలా సంస్థల్లోని పాఠ్యప్రణాళికలకు కాలం చెల్లిపోయి అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా లేవు. దీని ఫలితంగా పొందిన డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు స్థిరంగా ఉపాధి కల్పనగా మారడం లేదు అని రీఇమాజినింగ్ స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్ అనే నివేదికలో నీతి ఆయోగ్ పేర్కొంది. 2024-25 ఆర్థిక సర్వే నుంచి డాటాను ఉటంకిస్తూ కేవలం 8.25 శాతం మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే వారి అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలలో ఉపాధి పొందుతున్నారు అని నివేదిక పేర్కొంది.
దేశంలో విద్యావంతుల నిరుద్యోగం అధికంగానే ఉందని, పట్టభద్రులందరిలో 13 శాతం, పట్టభద్రులైన మహిళల్లో 20.4 శాతం మంది నిరుద్యోగులుగా ఉన్నారని, ఇది జాతీయ నిరుద్యోగ రేటు అయిన 3.2 శాతం కంటే చాలా ఎక్కువని నివేదిక పేర్కొంది. దీనికి తోడు బలహీనమైన ఉద్యోగ సంబంధాలున్న సాధారణ డిగ్రీ కోర్సుల వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపడం పరిస్థితిని మరింత దిగజార్చుతున్నదని నీతి ఆయోగ్ తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో చేరిన 3.4 కోట్ల మంది విద్యార్థులలో 1.13 కోట్ల మంది కేవలం బీఏలోనే ఉన్నారు. బీఏ, బీఎస్సీ, బీకామ్ కోర్సులలో కలిపి చేరిన వారి సంఖ్య 2 కోట్లకు పైగా ఉంది అని ఆ నివేదిక పేర్కొంది.
బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ) ఉన్నత విద్యా సర్వే గణాంకాల ప్రకారం ప్రత్యేక నైపుణ్యాలు లేకుండా సాధారణ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని అభ్యసించే వ్యక్తులు నెలకు సగటున రూ.22,000 ప్రారంభ వేతనాన్ని (ఏడాదికి 3.2శాతం వృద్ధితో) పొందుతుండగా నైపుణ్యాలు కలిగిన సాధారణ అండర్ గ్రాడ్యుయేట్ అదే వృద్ధి రేటుతో నెలకు రూ.29,000 వేతనాన్ని పొందుతున్నట్టు నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. కాలక్రమేణా ఈ వ్యత్యాసం పెరుగుతూ పోతుంది.
సాధారణ డిగ్రీ అభ్యర్థులలో నైపుణ్య శిక్షణ పొందిన వారికి, పొందలేని వారికి మధ్య ప్రారంభ వేతనంలో ఉన్న నెలకు రూ.7,000 వ్యత్యాసం 10 ఏండ్ల కాలంలో మొత్తం ఆదాయంలో రూ.9.7 లక్షల వ్యత్యాసంగా మారుతుంది. యఅఇనప్పటికీ అభ్యర్థులు తమ మార్గాలను ఎంచుకునే సమయంలో ఈ ప్రయోజనాలకు సంబంధించిన సమాచారం వారికి చాలా అరుదుగా మాత్రమే అందుతున్నది అని నివేదిక తెలిపింది. ముఖ్య ంగా మహిళల విషయంలో విశ్వాసం, సామాజిక ఆమోదం, భద్రత, సమయం లభ్యత, ఉపాధి ఫలితాల గురించి అనిశ్చితి వంటి ఆందోళనల వల్ల ఈ పరిమితులు మరింత తీవ్రమవుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. పని చేయాలనే, లేదా నైపుణ్యాలు పెంచుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ విశ్వసనీయమైన సహాయక వ్యవస్థలు తరచుగా కొరవడుతున్నాయని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది.