నాగ్‌పూర్ : నిర్మొహమాటంగా వ్యాఖ్య లు చేసే కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా రాజకీయాలు, నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నాగ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజల్ని బాగా మూర్ఖుల్ని చేయగలిగే వారే ఉత్తమ నాయకులవుతారని అన్నారు. ఈ విషయాన్ని వివరిస్తూ మాటలు చెప్పడం తేలికని, పని చేయడం కష్టమని అన్నారు. నిజాన్ని మనస్ఫూర్తిగా చెప్పడం వల్ల ఎంత నిరుత్సాహానికి గురి కావాల్సి వస్తోందో క్షేత్ర స్థాయిలో తాను అనుభవిస్తున్నానని చెప్పారు.
ప్రతి ఒక్కరికీ వారి సొంత శైలి, ఉద్దేశాలు ఉంటాయన్నారు. అంతిమంగా ప్రజల్ని మూర్ఖుల్ని చేయడం ద్వారా వారిని ఒప్పించగలిగే నాయకుడు తరచూ విజ యం సాధిస్తాడని చెప్పారు. ఇదే సమయంలో నిజానికి ఉన్న విలువను ఆయన నొక్కి చెప్పారు. సత్యమే అంతిమంగా విజయం సాధిస్తుందని భగవద్గీతలో కృష్ణుడు చెప్పారని గడ్కరీ అన్నారు. అడ్డదారుల గురించి ఆయన హెచ్చరిస్తూ ‘విజయాలు సాధించడానికి అడ్డదారులుంటాయి. మీరు నిబంధనలను ఉల్లంఘించవచ్చు, ప్రమాద సంకేతాలను దాటొచ్చు, ముందుకు దూకి వెళ్లొచ్చు. అయితే అడ్డదారులు మనల్ని తక్కువ చేస్తాయని ఓ తత్వవేత్త అన్నారు’ అని గడ్కరీ తెలిపారు.