న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కేంద్ర ప్రభుత్వం అధీనంలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) తీసుకొచ్చిన ‘వన్ వెహికిల్, వన్ ఫాస్టాగ్’ నిబంధన సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఒకే ఫాస్టాగ్‌ను పలు వాహనాలకు వినియోగించడం లేదా ఒక వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్ చేస్తున్న ఘటనలకు చెక్ పెట్టేందుకు ఎన్హెచ్ఏఐ ఈ కొత్త విధానం ప్రవేశపెట్టినట్టు తెలిపారు. ఇక నుంచి మల్టిపుల్ ఫాస్టాగ్‌లు పనిచేయవని, ఒక వాహనానికి పలురకాల ఫాస్టాగ్‌లు ఉన్న వాళ్లు ఏప్రిల్ 1 నుంచి వాటిని ఉపయోగించుకోలేరని ఆ అధికారి పీటీఐతో మాట్లాడుతూ పేర్కొన్నారు. పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల కారణంగా ఈ ‘వన్ వెహికిల్, వన్ ఫాస్టాగ్’ నిబంధన అమలు డైడ్‌లైన్‌ను మార్చి చివరి వరకు పొడిగించారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు, మర్చంట్లు మార్చి 15లోగా తమ ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చుకోవాలని ఆర్బీఐ ఇదివరకే సూచించిన సంగతి తెలిసిందే.