న్యూఢిల్లీ: దేశంలో 5 నుంచి 9 ఏళ్ల మధ్య వయసున్న మూడోవంతు పిల్లల్లో ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉన్నట్లు గుర్తించారు. జమ్మూకశ్మీర్, వెస్ట్ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల పిల్లల్లో ఇది మరీ ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం రిపోర్టులో వెల్లడైంది. బెంగాల్‌లోని 67 శాతం, సిక్కింలోని 64 శాతం, నాగాలాండ్‌లోని 55 శాతం, అస్సాంలోని 57 శాతం, జమ్మూకశ్మీర్‌లోని 50 శాతం పిల్లల్లో అత్యధిక స్థాయిలో ట్రైగ్లిజరాయిడ్స్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ అధికంగా ఉంటే, భవిష్యత్తులో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కేరళ, మహారాష్ట్ర పిల్లల్లో మాత్రం అత్యల్పంగా ట్రైగ్లిజరైడ్స్ ఉన్నట్లు తేల్చారు. కేరళలో 16.6 శాతం, మహారాష్ట్రలో 19.1 శాతంగా ఉంది. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ రిలీజ్ చేసిన చిల్డ్రన్ ఇన్ ఇండియా 2025 బుక్‌లో ఈ రిపోర్టు ఇచ్చారు. చండీఘడ్‌లో జరిగిన సీఎంసీఎస్ఎస్ఓ కార్యక్రమంలో ఈ రిపోర్టును రిలీజ్ చేశారు.
ప్రభుత్వ మంత్రిత్వ కార్యాలయాలు, శాఖలు సేకరించిన డేటా ద్వారా అంచనా వేశారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2019-21, నేషనల్ న్యూట్రిషన్ సర్వే 2016-18 రిపోర్టులను ప్రచురించిన తరహాలో డేటాను సేకరించారు. ప్రి మాచ్యురిటీ, తక్కువ బరువు ఉన్న పిల్లల్లో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు తెలిపారు. అఫిక్సియా(ఆక్సిజన్ అందకపోవడం), గాయాలు, న్యూమోనియా వల్ల కూడా శిశువుల్లో మరణాలు చోటుచేసుకుంటున్నాయి.
దేశంలో ఉన్న టీనేజర్లలో అయిదు శాతం మంది హైపర్‌టెన్సివ్‌గా ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీలో అత్యధికంగా హైపర్ పిల్లల సంఖ్య 10 శాతంగా ఉంది. ఆ తర్వాత యూపీ(8.6), మణిపూర్(8.3), చత్తీస్ఘడ్(7 శాతం) రాష్ట్రాలు ఉన్నాయి. భారత్‌లో ఉన్న 16 శాతం మంది టీనేజీ యువతలో ట్రైగ్లిజరైడ్స్ అధికంగా ఉన్నట్లు గుర్తించారు.