Infertility | న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వం(ఇన్ఫెర్టిలిటి)తో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. వయోజనుల్లో 17.5 శాతం మంది వంధ్యత్వంతో బాధపడుతున్నారని తెలిపింది.
పేద, ధనిక దేశాలు అనే తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఇదే పరిస్థితి ఉందని, ఇది ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సవాల్ అని పేర్కొంది. ఈ సమస్యకు నివారణ మార్గాలు, రోగ నిర్ధారణ, చికిత్సకు అవకాశాలు, ఐవీఎఫ్ లాంటి సాంకేతికత ఉన్నాయని తెలిపింది. అయితే, అధిక ధరలు, సామాజిక దురభిప్రాయం కారణంగా అవసరమైన వారు పొందలేకపోతున్నారని తెలిపింది.