న్యూఢిల్లీ: గత కొన్ని దశాబ్ధాల నుంచి శిశు మరణాల రేటు ఇండియాలో తగ్గుతోంది. కానీ పుట్టిన 36 మంది శిశువుల్లో ఒక శిశువు ఏడాది జీవిత కాలం పూర్తి కాకుండా మరణిస్తున్నట్లు తాజా ప్రభుత్వ డేటా వెల్లడించింది. ప్రతి వెయ్యి మంది శిశువుల్లో.. పుట్టిన ఏడాది లోపు చనిపోయే వారిని శిశు మరణ రేటు కింద లెక్కకడుతారు. అయితే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా తాజాగా ఐఎంఆర్ డేటాను రిలీజ్ చేసింది. 2020లో పుట్టిన ప్రతి వెయ్యి మంది పిల్లల్లో 28 మంది శిశువులు ఏడాది నిండాకుండానే ప్రాణాలు కోల్పోతున్నట్లు రిపోర్ట్‌లో తెలిపారు. కానీ 1971 డేటాతో పోలిస్తే ఇది నాలుగింతలు తక్కువే అని తేల్చారు. 1971ల్లో శిశు మరణ రేటు 129గా ఉంది.
గత పదేళ్లలో ఐఎంఆర్ 36 శాతం తగ్గినట్లు డేటాలో తేల్చారు. శిశు మరణ రేటు తగ్గినా.. 36 మంది శిశువుల్లో ఒక శిశువు ఏడాది లోపే చనిపోతున్నట్లు తాజా రిపోర్ట్‌లో ప్రభుత్వం పేర్కొన్నది. 2020లో అత్యధిక శిశు మరణాల రేటు మధ్యప్రదేశ్‌లో నమోదు అయ్యింది. ఆ రాష్ట్రంలో ఐఎంఆర్ 43గా ఉంది. ఇక మీజోరమ్లో కనిష్టంగా మూడు శాతం ఉంది.
దేశవ్యాప్తంగా జనన రేటు కూడా తగ్గింది. 1971లో 36.9గా ఉన్న జనన రేటు.. 2020లో 19.5గా నమోదు అయినట్లు తెలుస్తోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న జనన రేటు వ్యతాసం కూడా తగ్గింది. గడిచిన అయిదు దశాబ్ధాలుగా గ్రామీణ ప్రాంతాల్లోనే జనన రేటు అధికంగా ఉంది. 2011లో 21.8గా ఉన్న జనన రేటు.. 2020లో 19.5గా ఉంది. అంటే గత దశాబ్ధంలో జనన రేటు 11 శాతం పడిపోయింది. జనన రేటు ద్వారానే జనాభా పెరుగుదలను అంచనా వేసే వీలు ఉంటుంది.