భోపాల్, మార్చి 16: ఒకే ఒక్క సింగిల్ క్లిక్‌తో రైతులకు పంట నష్ట పరిహారం అందించామంటూ గొప్పలు చెప్పుకొన్న మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌పై రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘పరిహారం మాకు అందలేదు.. మరి ఎవరికి అందింది’ అని నిలదీస్తున్నారు. ‘పంట నష్టపోయిన 49 లక్షల మంది రైతులకు ఒక్క సింగిల్ క్లిక్‌తో రూ.7,618 కోట్లు పరిహారం చెల్లించాం’ అని శివరాజ్ ఫిబ్రవరిలో ప్రకటించారు. అయితే, సీఎం చెప్తున్నట్టు తమ ఖాతాల్లో డబ్బు జమ కాలేదని మధ్యప్రదేశ్ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 2న ముల్తాయ్ రైతులు 25 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి జిల్లా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. బీమా ప్రీమియం చెల్లించినా పరిహారం అందలేదని ఆరోపించారు. ఎమ్మెల్యేలు పెద్ద డమ్మీ చెక్కులు ఇచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోయారని, డబ్బు మాత్రం రైతుల ఖాతాల్లో జమ కాలేదని ధర్ జిల్లాకు చెందిన రామ్ సింగ్ చెప్పారు. రైతుల ఆందోళనలు తీవ్రం కావడంతో మధ్యప్రదేశ్ వ్యవసాయ మంత్రి కమల్ పటేల్ స్పందించారు. 1.5 లక్షల మందికి ఇంకా పరిహారం అందలేదని ఒప్పుకొన్నారు.