ముంబై: ఎయిర్ ఇండియా పైలెట్లు(Air India Pilots) జీతాల విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు కొత్త ఓనర్ రతన్ టాటాకు లేఖ రాశారు. ఓ పిటీషన్‌పై సుమారు 1500 మంది ఎయిర్ ఇండియా పైలెట్లు సంతకాలు చేశారు. ప్రస్తుత హెచ్ఆర్ టీమ్ తమ అభ్యర్థనలను పట్టించుకోవడం లేదని ఆ పిటీషన్లో ఆరోపించారు.
పైలెట్లు, క్యాబిన్ సిబ్బంది కోసం కొత్త జీతాల విధానాన్ని ఏప్రిల్ 17వ తేదీన ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది. ఆ ప్రతిపాదనలను రెండు పైలెట్ సంఘాలు వ్యతిరేకించాయి. ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్, ఇండియన్ పైలెట్స్ గిల్డ్లు పరిహార అంశాన్ని తప్పుపట్టాయి. కొత్త కాంట్రాక్టు విధానాన్ని తేల్చడానికి ముందు తమతో సంప్రదింపులు చేయలేదని పైలెట్లు ఆరోపించారు.
పునరుద్దరించిన కాంట్రాక్టు, శాలరీ విధానాన్ని అంగీకరించవద్దు అని రెండు సంఘాలు పైలెట్లను కోరుతున్నాయి. గత ఏడాది జనవరిలో టాటా గ్రూపు ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సంస్థ తమకు మర్యాదను ఇవ్వడం లేదని పైలెట్లు ఆరోపిస్తున్నారు. మా సమస్యలను పరిష్కరించేందుకు మీ జోక్యాన్ని కోరుతున్నట్లు పైలెట్లు తమ లేఖలో తెలిపారు.