న్యూఢిల్లీ: అమ్మాయిలు తమ లైంగిక వాంఛలను అదుపులో ఉంచుకోవాలని కోల్కతా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు(Supreme Court) తప్పుపట్టింది. రెండు నిమిషాల సుఖం కోసం తప్పు చేయవద్దు అని కూడా కోల్కతా కోర్టు ఓ కేసులో తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై ఇవాళ సుప్రీంకోర్టు స్పందిస్తూ.. జడ్జిలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయడం కానీ, బోధించడం సరికాదు అని తెలిపింది. ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వానికి, ఇతర పార్టీలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు కూడా జారీ చేసింది. కోల్కతా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని, అనవసరమైనవి కూడా అని సుప్రీంకోర్టు తెలిపింది.
వయసులో ఉన్న అమ్మాయిలు తమ లైంగిక వాంఛలను నియంత్రించుకోవాలని, ఎందుకుంటే రెండు నిమిషాల సుఖానికి లొంగిపోతే అప్పుడు ఆ మహిళ సమాజం దృష్టిలో ఓటమి ఎదుర్కోవాల్సి వస్తుందని కోల్కతా హైకోర్టు అక్టోబర్లో ఓ కేసులో విచారిస్తూ పేర్కొన్నది. తన శరీరాన్ని, హుందాతనాన్ని, ఆత్మ విలువను కాపాడుకునే హక్కు అమ్మాయిలకే ఉందని హైకోర్టు చెప్పింది. ఇదే దశలో అబ్బాయిలు కూడా అమ్మాయిలను గౌరవించడం నేర్చుకోవాలని కోర్టు సూచించింది.
ఓ రేప్ కేసులో టీనేజర్ అభ్యర్థనపై విచారణ సమయంలో కోల్కతా హైకోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది. రొమాంటిక్ రిలేషన్షిప్లో ఉన్న మైనర్ అమ్మాయిని రేప్ చేసినట్లు ఆ టీనేజర్ పై ఆరోపణలు ఉన్నాయి.