ఈ వేరియంట్ సోకిన వారిలో డెల్టాను అడ్డుకొనే యాంటిబాడీలు
న్యూఢిల్లీ: ‘ఒమిక్రాన్ వేరియంట్ ప్రకృతి అందించిన కరోనా టీకా’ అని కొంత మంది శాస్త్రవేత్తలు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ కంటే ఇది వేగంగా వ్యాపిస్తూ, దాని స్థానాన్ని ఆక్రమిస్తూ క్రమంగా ఆ వేరియంట్‌ను నిర్వీర్యం చేస్తున్నదని పేర్కొంటున్నారు. ఒమిక్రాన్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా ఉంటున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఈ వేరియంట్ వల్ల శరీరంలో ఉత్పత్తి అయిన యాంటిబాడీలు డెల్టా వేరియంట్‌ను కూడా సమర్థంగా ఎదుర్కొంటున్నాయి.
దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఒమిక్రాన్ సోకిన వారు డెల్టా బారినపడితే కోలుకొనే వేగం పెరిగిందని ఆఫ్రికా హెల్త్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ అలెక్స్ సిగ్నల్ చెప్పారు. ‘ఒమిక్రాన్ వల్ల డెల్టా ప్రభావం తగ్గిపోతున్నది. ఫలితంగా క్రమంగా డెల్టా వ్యాప్తి ఆగిపోవచ్చు’ అన్నారు.
మిగతా వేరియంట్లతో పోల్చితే వ్యాప్తి వేగం ఒమిక్రాన్‌కు ఎక్కువ. తక్కువ ప్రమాదకరం. ఈ లక్షణాల కారణంగా ఈ వేరియంట్ ఎక్కువ మందికి సోకి దేశాలు హెర్డ్ ఇమ్యూనిటీ సాధించొచ్చని పుణెలోని డీవై పాటిల్ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్, ఎపిడమాలజిస్టు అమితావ్ భరద్వాజ్ అన్నారు. ‘ప్రస్తుతం ఉన్న కరోనా టీకాలు శరీరంలో యాంటిబాడీలను ఉత్పత్తి చేయడం ద్వారా వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. ఒమిక్రాన్ కూడా అదే పనిచేస్తున్నది’ అని వ్యాఖ్యానించారు.