న్యూఢిల్లీ : కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నా.. ఇప్పటి వరకు తీవ్రమైన అనారోగ్యానికి ఎవరూ గురికాలేదని పుదుచ్చేరి జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) డైరెక్టర్ రాకేశ్ అగర్వాల్ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడంతో పాటు సమావేశాలకు దూరంగా ఉండడంవంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్‌ల ఆవశ్యకతపై స్పందిస్తూ.. వ్యాక్సినేషన్ రంగంలోని నిపుణులు పరిశీలిస్తున్నారని, ప్రస్తుతానికైతే బూస్టర్ డోసుల పాత్ర పెద్దగా లేదని తెలుస్తోందని తెలిపారు. దేశ జనాభాలో ఎక్కువగానే వైరస్ బారినపడ్డారని, వ్యాక్సిన్లు సైతం తీసుకున్నారన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అపూర్వమైన స్థాయిలో వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకు మహమ్మారి కొత్త స్ట్రెయిన్ 77 దేశాలకు విస్తరించిందని డబ్ల్యూహెచ్ఓ జనరల్ టెడ్రోస్ ఘెబ్రేయేసన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. భారత్‌లో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. నిన్నటి వరకు 57 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదవగా.. బుధవారం హైదరాబాద్‌లో ఇద్దరు విదేశీయులు, పశ్చిమ బెంగాల్లో ఏడు సంవత్సరాల బాలుడు వేరియంట్‌కు పాజిటివ్‌గా పరీక్షించారు. ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 28 కేసులు నమోదవగా.. గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఏపీ, కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్‌లోనూ కేసులు రికార్డయ్యాయి.