న్యూఢిల్లీ : దేశంలో కరోనా కొత్త ఉత్పరివర్తనం ఒమిక్రాన్ (Omicron) పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 17 రాష్ట్రాల్లో 350 మంది వరకు ఈ మహమ్మారి బారినపడ్డారు. ప్రస్తుతం జరిగిన అధ్యయనాల ప్రకారం.. వైరస్ వేగంగా వ్యాపిస్తున్నా.. తీవ్రత మాత్రం తక్కువగానే ఉన్నది. చాలా మంది బాధితుల్లో కేవలం తేలికపాటి లక్షణాలు ఉండడం ఉపశమనం కలిగించే విషయమని నిపుణులు పేర్కొంటున్నారు.
తక్కువ సమయంలోనే కొత్త వేరియంట్ నుంచి బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్తున్నారని వైద్యులు చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రమైన సమస్యలను కలిగించడం లేదని, అయితే, వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని లోక్‌నాయక్ ఆసుపత్రిలో ఒమిక్రాన్ బాధితులకు అందిస్తున్న చికిత్స, కోలుకుంటున్న విధానంపై వైద్యులు కీలక విషయాలు వెల్లడించారు. ఇప్పటి వరకు ఆసుపత్రిలో 40 మంది బాధితులు చేరారు. ఇందులో 19 మంది రోగులు కోలుకొని ఇంటికి వెళ్లారు.
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందే అంటువ్యాధని వైద్యులు పేర్కొంటున్నారు. అయితే, రోగుల్లో కేవలం తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తుండడం శుభవార్తని చెబుతున్నారు. ఆసుపత్రిలో చేరిన రోగుల్లో చాలా మందికి మల్టీ విటమిన్, పారాసెటమాటల్ మాత్రలు మాత్రమే ఇస్తున్నట్లు లోక్ నాయక్ ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు. దీంతో రోగులు వేగంగా కోలుకొని ఇండ్లకు వెళ్తున్నారన్నారు. డెల్టా వేరియంట్ ఇన్ఫెక్షన్తో పోలిస్తే ఈ సారి రోగులు శ్వాస అందకపోవడం తదితర తీవ్రమైన ఇబ్బందులున్నట్లు ఫిర్యాదులు చేయడం లేదని వైద్యులు పేర్కొన్నారు.
ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల్లో 90శాతం మంది లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. మిగతా వారిలో గొంతు నొప్పి, దద్దుర్లు, తేలికపాటి జ్వరం, ఒంటి నొప్పులు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం మల్టీ విటమిన్, పారాసిటమాల్‌తో పాటు రోగులకు ప్రత్యేకంగా మందులు ఇస్తున్నామని, ప్రత్యేకంగా చికిత్సలు అందించాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా నివారణకు ప్రజలంతా తప్పక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువ ఒమిక్రాన్ కేసులు ఎక్కువ నిర్ధారణ అవుతున్నాయని తెలిపారు. వారి కాంటాక్టులు సైతం కొందరు పాజిటివ్‌గా పరీక్షించినట్లు పేర్కొన్నారు. ఒమిక్రాన్ వేరియంట్‌ను నివారించేందుకు ప్రజలంతా స్థిరమైన కొవిడ్ ప్రవర్తనా నియమావళిని అనుసరించడం తప్పనిసరన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు కొత్త వేరియంట్ కేసులు 67 మందికి నిర్ధారణ అయ్యింది. ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతున్న తీరు భయపెడుతోందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సమయంలో నివారణ చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా రానున్న రోజుల్లో ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించడం, టీకా తీసుకోవడం, సామాజిక దూరం పాటించడంతో పాటు చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటూ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.