శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదుల దాడిలో హత్యకు గురైన బీహార్‌కు చెందిన వీధి వ్యాపారి వీరేంద్ర పాశ్వాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు తమ రాష్ట్రానికి తీసుకెళ్లలేకపోయారు. జమ్ముకశ్మీర్ నుంచి బీహార్‌కు ఆయన మృతదేహాన్ని తరలించేందుకు అయ్యే ఖర్చును భరించలేక శుక్రవారం శ్రీనగర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు.
జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా దీనిపై స్పందించారు. జమ్ముకశ్మీర్ పరిపాలనా యంత్రాంగంపై ఆయన మండిపడ్డారు. ఎంపీలు, మంత్రుల ఆసుపత్రి ఖర్చులకు లక్షల్లో వ్యయం చేసే ప్రభుత్వానికి ఒక సామాన్య వ్యక్తి మృతదేహాన్ని సొంత రాష్ట్రానికి తరలించేందుకు డబ్బులు లేకపోయాయని విమర్శించారు. ఇది ఎంతో సిగ్గుచేటు అంటూ శుక్రవారం ఆయన ఒక ట్వీట్ చేశారు.
What a shame that no one in the J&K government saw fit to help the family of Virendra Paswan get back to Bihar with his body. J&K must have spent lakhs of rupees on hospitality for MPs & Ministers but couldn’t find any money for this. https://t.co/QWVfF8xRgk
— Omar Abdullah (@OmarAbdullah) October 8, 2021
మరోవైపు ఉగ్రవాద దాడిలో మరణించిన టీచర్ సుపిందర్ కౌర్ కుటుంబ సభ్యులు శ్రీనగర్‌లోని పౌర సచివాలయం వద్ద శుక్రవారం బైఠాయించారు. ఉగ్రవాదులు కశ్మీర్ పండిట్లను లక్ష్యంగా చేసుకుని చంపడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సుపిందర్ కౌర్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఊరేగింపుగా తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న స్థానికులు న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు.
#WATCH | Mortal remains of Supinder Kaur, killed in yesterday's targeted killing by terrorists in Srinagar, being taken for last rites, slogans against "The Resistance Front" (TRF) being raised during the funeral procession in Srinagar pic.twitter.com/UyXfq88wHb
— ANI (@ANI) October 8, 2021
కశ్మీర్ పండిట్ల సంఘాలు కూడా శ్రీనగర్‌లో శుక్రవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. కశ్మీర్ పండిట్లకు రక్షణ కల్పించే చర్యలను ప్రభుత్వ యంత్రాంగం చేపట్టలేదని ఆరోపించాయి. జమ్మూకశ్మీర్ పీపుల్స్ ఫోరం జమ్మూలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించింది. ఉగ్రవాదులు శ్రీనగర్‌లో ఇద్దరు టీచర్లను చంపడాన్ని కశ్మీర్ పండిట్లు ఖండించారు. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.