Farooq Abdullah : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) – నేషనల్ కాన్ఫరెన్స్ (National conference) కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం మొత్తం 90 స్థానాల్లో 51 చోట్ల కూటమి ఆధిక్యంలో ఉన్నది. బీజేపీ (BJP) 28 చోట్ల మాత్రమే లీడ్‌లో ఉంది.
ఇక పీడీపీ అయితే కేవలం 2 స్థానాల్లో, ఇతరులు 9 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఎన్సీ-కాంగ్రెస్ కూటమి ఆధిక్యం మెజారిటీ మార్కును దాటడంతో జమ్ముకశ్మీర్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడబోతున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటించారు.
జమ్ముకశ్మీర్‌కు కాబోయే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లానే అని ఫరూఖ్ అన్నారు. ప్రజలు గొప్ప తీర్పును వెలువరించారని ఆయన కొనియాడారు. కాగా, ఫరూఖ్ అబ్దుల్లా కుమారుడైన ఒమర్ అబ్దుల్లా ఇదివరకు కూడా జమ్ముకశ్మీర్ సీఎంగా పనిచేశారు. ఇండియా కూటమి అధికారాన్ని చేపట్టబోతున్న నేపథ్యంలో అబ్దుల్లా నివాసం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.