జైపూర్: ఉక్రెయిన్ ఫస్ట్ లేడీ(Ukrainian First Lady), ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ సతీమణి ఒలీనా వొలోడిమిరివ్నా జెలెన్స్కా ఇవాళ జైపూర్‌కు వచ్చి వెళ్లారు. జపాన్ టూరుకు వెళ్తున్న ఉక్రెయిన్ బృందంలో ఆమె ఉన్నారు. అయితే ఆ బృందం ప్రయాణిస్తున్న విమానం ఇంధనం కోసం ఇవాళ జైపూర్‌కు వచ్చింది. అక్కడి విమానాశ్రయంలో సుమారు రెండు గంటల పాటు విమానాన్ని ఆపారు. ఆ సమయంలో జెలెన్స్కీ భార్య .. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో వెయిట్ చేశారు. ఢిల్లీలో ఉన్న ఉక్రెయిన్ దౌత్య కార్యాలయ సిబ్బంది ఆ టైంలో ఆమెను కలిశారు.
జపాన్‌తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఉక్రెయిన్ బృందం ఆ దేశానికి వెళ్తుంది. మార్గమధ్యంలో ఉన్న ఇండియాలో వాళ్లు పిట్‌స్టాప్ తీసుకున్నారు. బృందంలో జెలెన్స్కీ భార్యతో పాటు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రి సిబియా ఉన్నారు. విమానం రీఫుయలింగ్ రిక్వెస్ట్‌కు భారత విదేశాంగ శాఖ ఆమోదం తెలిపింది. ప్రోటోకాల్ ప్రకారం రీఫుయలింగ్ చేయాలని పౌరవిమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ ఉదయం 6.30 నిమిషాలకు జెలెన్స్కీ భార్య ప్రయాణిస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండ్ అయ్యింది. చెకింగ్, ఫ్రిస్కింగ్ నుంచి మినహాయింపు కల్పించారు.
ఉక్రెయిన్ బృందంలో 23 మంది సభ్యులు ఉన్నారు. వారికి జైపూర్ వీఐపీ లాంజ్‌లో రిఫ్రెష్మెంట్ కల్పించారు. ఇమ్మిగ్రేషన్ అవసరం లేకుండా చేశారు. మళ్లీ ఉదయం 8.15 నిమిషాలకు ఆ విమానం బయలుదేరి వెళ్లింది.