జైపూర్: రాజస్థాన్‌లోని పాకిస్థాన్ సరిహద్దు జిల్లాలతో పాటు, ఆ రాష్ట్రం అంతటా శనివారం ‘ఆపరేషన్ షీల్డ్’ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సమయంలో పలువురు అధికారులపై తేనెటీగలు దాడి చేశాయి. (Bees Attack) దీంతో వారంతా పరుగులు తీశారు. ఈ సంఘటన రియల్ మాక్ డ్రిల్‌ను తలపించింది. ఝలావర్‌లోని కాలిసింధ్ డ్యామ్ వద్ద మాక్ డ్రిల్ సందర్భంగా డ్రోన్ దాడి జరుగుతుందన్న పరిస్థితి నెలకొన్నది. అయితే అదే సమయంలో అక్కడున్న కలెక్టర్, ఎస్పీతో సహా చాలా మంది అధికారులు, ఉద్యోగులపై తేనెటీగలు దాడి చేశాయి. దీంతో వారంతా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు.
కాగా, మాక్ డ్రిల్‌లో భాగంగా రాజస్థాన్ అంతటా శనివారం రాత్రి 8 గంటల నుంచి వేర్వేరు సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వివిధ నగరాల్లో 15 నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బ్లాక్అవుట్ సమయంలో, ప్రజలు తమ ఇళ్ళు, షాపులు, కార్యాలయాల్లో లైట్లు ఆర్పివేశారు. రోడ్లపై వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. హెడ్లైట్లను కూడా ఆపివేశారు. జైపూర్‌లోని ఖతిపురా రోడ్డులో ఉన్న ప్రభుత్వ స్కూల్ గ్రౌండ్లో డ్రోన్, క్షిపణి దాడులతో రియల్ టైమ్ మాక్ డ్రిల్ నిర్వహించారు.
Also Read: