Officer murder : ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని మీరట్‌లో భార్య, ఆమె ప్రియుడి చేతిలో సౌరభ్ రాజ్‌పుత్ (Saurabh Rajput) అనే 29 ఏళ్ల మర్చంట్ నేవీ అధికారి (Merchant navy officer) దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన అధికారి భార్య ముస్కాన్ (Muskan), ఆమె ప్రియుడు సాహిల్ (Sahil) జైల్ల వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. ఇద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారని, జైలుకు వచ్చినప్పటి నుంచి అవి లేకపోవడంతో వింతగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు.
జైల్లో పెట్టిన ఆహారం తినడం లేదని, తమకు గంజాయి కావాలని, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నారని జైలు అధికారులు చెప్పారు. జైలుకు వచ్చినప్పటి నుంచి నిందితుల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలుపెట్టిందని తెలిపారు. సాహిల్‌ను ఆస్పత్రికి తరలించగా అక్కడ తీవ్ర గందరగోళం సృష్టించాడని, గంజాయి ఇవ్వాలని డిమాండ్ చేశాడని చెప్పారు. మానసికస్థితి సరిగా లేకపోవడంవల్ల వారు తోటి ఖైదీలపై దాడి చేసే అవకాశం ఉండడంతో వేరేగా ఉంచినట్లు తెలిపారు.
నిందితులు ఇద్దరు ప్రతిరోజు మాదకద్రవ్యాల ఇంజెక్షన్లు తీసుకుంటారని గుర్తించామని, అవి లేకపోవడంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. హత్య సమయంలోనూ సాహిల్ డ్రగ్స్ మత్తులోనే ఉన్నట్లు వారు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారిని జైలులోని డీ అడిక్షన్ సెంటర్లో ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కాగా సౌరభ్ రాజ్‌పుత్(29), ముస్కాన్(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాన్‌కు సాహిల్ (25) తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
విషయం సౌరభ్ రాజ్‌పుత్‌కు తెలియడంతో వ్యవహారం విడాకుల వరకు వెళ్లింది. కానీ కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గాడు. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. గతనెల కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. తన వివాహేతర బంధానికి అడ్డు తొలగించుకోవడానికి ఇదే అదునుగా భావించిన ముస్కాన్.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేసింది. మృతుడి కుటుంబం ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.